ఏపీ జలదోపిడీ బట్టబయలు!.. అధికారికంగా 780 టీఎంసీలే.. తీస్కపోయింది 1500 టీఎంసీలు

ఏపీ జలదోపిడీ బట్టబయలు!.. అధికారికంగా 780 టీఎంసీలే.. తీస్కపోయింది 1500 టీఎంసీలు
  • స్వయంగా వెల్లడించిన  ఏపీ మంత్రులు 
  • ఖరీఫ్‌‌‌‌‌‌‌‌లో 888 టీఎంసీలు, రబీలో 
  • 153 టీఎంసీలు ఇచ్చామని చెప్పిన అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు
  • మరో 461 టీఎంసీలు ఉన్నాయని వెల్లడి
  • ఇన్ని నీళ్లున్నా తాగునీటి కోసమంటూ సాగర్​ నుంచి మరో 10 టీఎంసీలు దోపిడీ
  • ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్ఎంసీ విస్తరణ పనులనూ వేగవంతం చేయాలని ఏపీ సీఎం ఆదేశాలు
  • అదే జరిగితే తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు అందవన్న ఆందోళనలు

హైదరాబాద్, వెలుగు:ఏపీ జలదోపిడీ బట్టబయలైంది. ఇప్పటిదాకా అధికారిక లెక్కలే బయటకు వస్తున్నా.. అనధికారికంగా తన్నుకుపోతున్న నీటి లెక్కలు మాత్రం వెలుగుచూడడం లేదు. తాజాగా.. ఆ రాష్ట్ర మంత్రులే స్వయంగా ఆ లెక్కలపై పెదవి విప్పడంతో ఏపీ పాలకులు అంత పెద్దమొత్తంలో నీటిని తరలిస్తున్నారా? అన్న చర్చ నడుస్తున్నది. ఈ ఏడాది అధికారిక లెక్కల ప్రకారం కృష్ణా నుంచి 780  టీఎంసీలు తరలించినట్లు ఏపీ చెప్తున్నా అనధికారికంగా ఆ మొత్తం 1500 టీఎంసీల వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం ఏపీలో నిర్వహించిన ఓ రివ్యూలో ఆ రాష్ట్ర వ్యవసాయ, ఇరిగేషన్​ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, తాము తరలిస్తున్న నీటి వివరాలను వెల్లడించారు. 

ప్రాజెక్టులవారీగా ఖరీఫ్​ సీజన్​లో 888 టీఎంసీలు, రబీ సీజన్​లో 153 టీఎంసీల నీళ్లను పంటలకు ఇచ్చినట్టు  చెప్పుకొచ్చారు. అంతేకాదు..వివిధ రిజర్వాయర్లలో ప్రస్తుతం మరో 461 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నట్టు వివరించారు. పనిలో పనిగా త్వరలో రాబోయే ఖరీఫ్​ సీజన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి నీటి విడుదల షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను కూడా ప్రకటించేశారు. అంటే మంత్రులు చెప్పిన లెక్క ప్రకారమే ఇప్పటికీ ఉన్న 461 టీఎంసీలు కలిపి.. ఈ ఏడాదే మొత్తంగా  1500 టీఎంసీల దాకా జలాలను తరలించినట్టు తేటతెల్లమవుతున్నది. ఇందులో గోదావరి నుంచి తరలించే 80 టీఎంసీలను తీసేస్తే మిగిలిన నీళ్లన్నీ కృష్ణా నుంచి మళ్లించినవే.  ఇంకా ఆ రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లలో 461 టీఎంసీల నీళ్లున్నా.. మళ్లీ తాగునీళ్లంటూ డ్రామాలు మొదలుపెట్టి సాగర్​ కుడి కాల్వ నుంచి 10 టీఎంసీలను ఎత్తుకుపోయేందుకు సిద్ధమవుతున్నది.ఏపీని అడ్డుకోవాల్సిన ఈఎన్సీ జనరల్​ మాత్రం.. ఇటీవల జరిగిన కృష్ణా బోర్డు త్రీమెంబర్​ కమిటీ మీటింగ్‌లో ఏపీ అడిగినన్ని నీళ్లకూ ఓకే చెప్పేసి రావడంపై విమర్శలు వస్తున్నాయి. 

ఒక్క నెలలో 210 టీఎంసీలు స్టోర్​ చేసుకునేలా..

ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ గండి కొట్టింది. పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​ ద్వారా జలదోపిడీని పీక్స్‌కు తీసుకెళ్తున్నది. లక్షన్నర క్యూసెక్కులు తీసుకునేలా 14 వెంట్లకు దాని కెపాసిటీని పెంచింది. పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకెళ్లాలంటే శ్రీశైలం రైట్​మెయిన్​ కెనాల్​చాలా కీలకం. ఆ కెనాల్​ సామర్థ్యాన్ని పెంచేందుకు గతంలోనే పొరుగు రాష్ట్రం చర్యలను ప్రారంభించింది. తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో కెనాల్​ లైనింగ్​, సామర్థ్యం పెంపు పనులు కొంచెం లేట్​ అవుతున్నాయి. 

కాగా, ఇప్పుడు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం.. దానిని వేగవంతం చేసింది. తాజాగా.. సోమవారం చేసిన రివ్యూలో.. ఎస్‌ఆర్‌‌ఎంసీ విస్తరణ పనుల్లో వేగం పెంచాల్సిందిగా అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే 50 వేల క్యూసెక్కులు తరలించే కెపాసిటీ ఉన్న కెనాల్‌ను.. 80 వేల క్యూసెక్కులు తరలించేలా లైనింగ్​ వర్క్‌తో విస్తరించే పనులు చేస్తున్నది. అంటే రోజూ 7 టీఎంసీల చొప్పున ఒక్క నెలలో 210 టీఎంసీలను తరలించి నెల్లూరు జిల్లాలోని రిజర్వాయర్లలో స్టోరేజ్​ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నది. 2028 జూన్​ నాటికి విస్తరణ పనులు పూర్తి చెయ్యాలని చంద్రబాబు అధికారులకు టార్గెట్​ పెట్టారు. కెనాల్​ విస్తరణ పూర్తయితే మాత్రం మనకు శ్రీశైలం నుంచి నీళ్లు అందని పరిస్థితి ఏర్పడుతుంది. 

శ్రీశైలం ఆధారంగానే మనం ప్రస్తుతం ఎస్​ఎల్​బీసీ, కల్వకుర్తి, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులను చేపడుతున్నాం. ఎస్ఆర్ఎంసీ విస్తరణ పూర్తయితే మాత్రం మన ప్రాజెక్టులకు గండి పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.

గోదావరి డైవర్షన్​ లెక్కలేవి?

పట్టిసీమ ద్వారా పోలవరం నుంచి 80 టీఎంసీల నీళ్లను కృష్ణా బేసిన్‌లోకి ఏపీ మళ్లించి వాడుకుంటున్నది. కానీ, ఏటా అక్కడి నుంచి ఎన్ని నీళ్లను తరలిస్తుందనేదానిపై స్పష్టమైన లెక్కలు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించి గోదావరి బోర్డులో డేటాను అప్​డేట్​ చేస్తున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, సాగర్‌‌ల నుంచే మన కండ్లముందే వందల కొద్దీ టీఎంసీలను తన్నుకుపోతున్న పొరుగు రాష్ట్రం.. గోదావరి నుంచి ఇంకెన్ని నీళ్లను తరలిస్తున్నదో అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు గోదావరి డైవర్షన్​ ద్వారా ఏపీ 80 టీఎంసీలు తరలిస్తే.. మనకూ హక్కుగా అందులో 45 టీఎంసీలు రావాల్సి ఉంటుంది. కానీ, దానికీ ఏపీ అడ్డుపుల్లలు వేస్తూనే ఉన్నది. 

ట్రిబ్యునల్​సాకు చూపించి మన వాటా నీళ్లకు అడ్డుపడుతున్నది. ఇప్పుడు గోదావరిలోనూ నీటిని కాజేసే ఎత్తుగడతో గోదావరి ట్రిబ్యునల్‌ను వేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నది. మరోవైపు వచ్చే వాటర్​ ఇయర్‌‌కు సంబంధించి ఏపీ ఇప్పుడే వాటర్​ రిలీజ్​ షెడ్యూల్‌నూ జారీ చేసింది. గోదావరి డెల్టాకు సంబంధించి జూన్​ 1 నుంచి నీళ్లు వదిలేందుకు ఓకే చెప్పేశారు. గాలేరు నగరి సుజల స్రవంతి ఆయకట్టు కింద జూన్​ 10 నుంచి, కడప ఆయకట్టుకు జూన్​ 15 నుంచి, కృష్ణా డెల్టాకు జులై 1 నుంచి, కేసీ కెనాల్​, తెలుగు గంగ, ఎస్‌ఆర్​బీసీ, తుంగభద్ర ఎల్ఎల్‌సీ కింద జులై 20 నుంచి, హంద్రీనీవా సుజల స్రవంతి కింద జులై 31 నుంచి, నాగార్జునసాగర్​ ఆయకట్టులోని పల్నాడు, గుంటూరు, బాపట్లకు జులై 31, ప్రకాశం, మార్కాపురంలకు ఆగస్టు చివరి నుంచి నీళ్లు ఇచ్చేలా షెడ్యూల్‌ను విడుదల చేశారు. 

వాస్తవానికి ప్రాజెక్టులు నిండాక.. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీళ్ల లెక్క ఆధారంగా ఆయకట్టుకు నీటి విడుదలపై షెడ్యూల్‌ను విడుదల చేస్తుంటారు. కానీ, ఏపీ మాత్రం ముందుముందుగానే నీటిని తరలించుకుని నిల్వ చేసుకుని.. కాలం రాకముందే షెడ్యూల్‌ను విడుదల చేసుకుంటున్న తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది.