ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు అప్లికేషన్లు

ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పల్లె దవాఖానాల్లో ఖాళీగా ఉన్న 1,569 మిడ్ లెవెల్​ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. జిల్లాల వారీగా కలెక్టర్లు బుధవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు​ ఇవ్వనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి మంగళవారం కలెక్టర్లకు లెటర్​ రాశారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎంఎల్​హెచ్​పీ నియామక ప్రక్రియ చేపడుతుందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో 349, గ్రామీణ ప్రాంతాల్లో 1,220 ఎంఎల్​హెచ్​పీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపాలిటీల్లోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఈ పోస్టులకు ఎంబీబీఎస్, బీఏఎమ్ఎస్ అర్హత ఉన్నవారినే తీసుకోనున్నారు. ఎంబీబీఎస్ వాళ్లకు ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ ఎంబీబీఎస్ అర్హత ఉన్న వాళ్లు లేకుంటే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన స్టాఫ్ నర్స్, 2020కు ముందు జీఎన్ఎమ్ పూర్తి చేసి, కమ్యూనిటీ హెల్త్​ పై 6 నెలల బ్రిడ్జి కోర్సు చేసిన వాళ్లకు అవకాశం ఇస్తారు.

పట్టణ ప్రాంతాల్లో ఎంబీబీఎస్  డాక్టర్లు పనిచేసేందుకు ముందుకురాకుంటే ఆయుష్ వైద్యులకు అవకాశమిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంబీబీఎస్, ఆయుష్ వైద్యులు కూడా అప్లయ్​ చేసుకోకుంటే స్టాఫ్ నర్స్​లను తీసుకుంటారు. ఈ పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 44 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేండ్లు, దివ్యాంగులకు పదేండ్ల సడలింపు ఇచ్చారు. ఎంబీబీఎస్, ఆయుష్ డాక్టర్లకు రూ. 40 వేలు, స్టాఫ్ నర్సులకు రూ.29,900 జీతం చెల్లిస్తారు. ఆయుష్ వైద్యులైతే కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జి కోర్సు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకోనున్నారు. వచ్చే నెల 3న ఫైనల్​ లిస్ట్​ రిలీజ్​ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రెండు వారాల శిక్షణ ఇస్తారు.