T20 World Cup 2024: న్యూజిలాండ్ లెక్కే వేరు: పిల్లలతో వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటన

T20 World Cup 2024: న్యూజిలాండ్ లెక్కే వేరు: పిల్లలతో వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటన

జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా  జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం  న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే న్యూజిలాండ్ వరల్డ్ కప్ స్క్వాడ్ ను ఇద్దరు పిల్లలతో ప్రకటించాలని కివీస్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. దీనికి సంబంధించిన వీడియో బ్లాక్ క్యాప్స్ తన ఎక్స్ లో షేర్ చేసింది. ఇద్దరు చిన్న పిల్లలు అంగస్, మటిల్డాగా తమను తాము పరిచయం చేసుకుంటూ వరల్డ్ కప్ స్క్వాడ్ ను ఎంపిక చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

"ప్రతి ఒక్కరికీ శుభోదయం. ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. నేను మటిల్డా. నేను అంగస్‌ని. ఈ రోజు వెస్టిండీస్, USAలో జరిగే ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్ జట్టును ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది." అని పిల్లలు వీడియోలో చెప్పారు. న్యూజి లాండ్ భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లో కుటుంబ సభ్యులతో తమ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పిల్లలతో వరల్డ్ కప్ జట్టును ప్రకటించి తమ లెక్కే వేరని చెప్పకనే చెప్పింది. 

ఈ మెగా టోర్నీ కోసం జట్టును ప్రకటించిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.. ఇందులో స్టార్ ప్లేయర్లు అందరికీ చోటు కల్పించింది. కెప్టెన్  కేన్ విలియమ్సన్ కు ఇది ఆరో వరల్డ్ కప్ కాగా కెప్టెన్ గా నాలుగోది కావడం విశేషం. టిమ్ సౌథీకి ఇది ఏడో వరల్డ్ కప్ టోర్నీ.  

జూన్ 1న  టీ20 వరల్డ్ కప్  మొదలుకానుంది.  జూన్ 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. అందులో భాగంగా న్యూజిలాండ్ తన తొలి మ్యాచును జూన్ 7న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్, ఉగాండ, పపువా న్యూ గునియాలతో మ్యాచులు ఆడనుంది. మొత్తం ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి.