గచ్చిబౌలిలో వ్యాపారవేత్త ఇంట్లో సుమారు కేజీ బంగారం చోరీ.. ఇంట్లో పనిచేసే నేపాల్‌ భార్యాభర్తపై అనుమానం

గచ్చిబౌలిలో వ్యాపారవేత్త ఇంట్లో సుమారు కేజీ బంగారం చోరీ.. ఇంట్లో పనిచేసే నేపాల్‌ భార్యాభర్తపై అనుమానం

హైదరాబాద్: గచ్చిబౌలిలో వ్యాపారవేత్త ఇంట్లో సుమారు కేజీ బంగారం చోరీకి గురైంది. ఇంట్లో పనిచేసే నేపాల్‌ భార్యాభర్తపై యజమాని అనుమానం వ్యక్తం చేశాడు. ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన భార్యాభర్తలు ప్రధాన అనుమానితులుగా పోలీసులు భావిస్తున్నారు. 

నెల రోజుల క్రితమే వీరిని పనిలో పెట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి, ఆదివారం తిరిగి వచ్చేసరికి ఆ నేపాలీ దంపతులు కనిపించలేదు. ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు.

పూజా గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు సదరు వ్యాపారవేత్త ఫిర్యాదు చేశాడు. పోలీసులు సిసిటివి (CCTV) ఫుటేజ్ను పరిశీలించారు. నిందితుల కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గృహయజమానులు ఇంటి సిబ్బంది నియామకంలో పూర్తి వివరాలు ధ్రువీకరించుకోవాలని పోలీసులు సూచించారు.
 
2026 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్ సిటీలో నేపాలీ దొంగలు ఈ తరహా చోరీకి పాల్పడ్డారు. నందగిరి హిల్స్కు చెందిన వ్యాపారి రవీంద్ర శర్మ ఇంట్లో నేపాల్​కు చెందిన భూపేందర్ షాహి అలియాస్ భువన్ (22) వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 5న ఇంటి ఓనర్ బయటకు వెళ్లగానే ఇంట్లో పనిచేసే ఇతర సిబ్బందికి కూల్​డ్రింక్​లో మత్తుమందు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశాడు.

అనంతరం ఇంటి బయట వేచి ఉన్న తన సహచరులను లోపలికి పిలిపించి, ఇనుప రాడ్, స్క్రూ డ్రైవర్తో లాకర్​ను బలవంతంగా తెరిచి నగలు దోచుకున్నారు. ఘటనాస్థలంలో నిందితులు వదిలివెళ్లిన మొబైల్ ఫోన్, సాంకేతిక సమాచారం ఆధారంగా ఇండో-–నేపాల్ సరిహద్దు వద్ద భూపేందర్ షాహి, కృష్ణ చంద్ (23)ను అదుపులోకి తీసుకుని రూ.1.3 కోట్ల విలువైన నగలు రికవరీ చేశారు.