సర్కార్ ప్రీమియం కడ్తలే..  రైతులకు పరిహారం వస్తలే 

సర్కార్ ప్రీమియం కడ్తలే..  రైతులకు పరిహారం వస్తలే 
  • రైతులు ప్రీమియం కట్టినా.. వాటా చెల్లించని సర్కార్ 
  • కట్టాల్సిన ప్రీమియం రూ. 515 కోట్లు.. 
  • ఆగిన పరిహారం రూ. 840 కోట్లు   
  • ఏటా పంట నష్టపోయిన రైతులకు పైసా సాయం అందుతలే  

హైదరాబాద్, వెలుగు:  రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చెడగొట్టు వానలతో ఆగమవుతోంది. ఏటా వేల కోట్ల నష్టం జరుగుతోంది. అయినా రైతులను ఆదుకునే దిశగా సర్కార్ నుంచి ఎలాంటి భరోసా అందడం లేదు. గతంలో అమలైన పంటల బీమాను కూడా ప్రభుత్వం రెండేండ్లుగా పూర్తిగా నిలిపేసింది. ఫసల్ బీమా మొదలైన రెండేండ్లు బాగానే అమలైంది. ఆ తర్వాత 2018–19 నుంచి ఈ స్కీంను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టేసింది. రైతులు తమ వాటా చెల్లించినా, ప్రభుత్వం మాత్రం ప్రీమియం కట్టడంలేదు. దీంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపులను ఇన్సురెన్స్ కంపెనీలు ఆపేశాయి. 
రెండేండ్లుగా ఆగిన పరిహారం..  
రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియంలో తన వాటా చెల్లించపోవడంతో 2018–20 వరకు రెండేండ్ల పాటు పంట నష్టపోయిన లక్షలాది మంది  రైతులకు రూ.840.69 కోట్ల పరిహారం ఇప్పటికీ అందలేదు. 2018–19లో రెండు సీజన్‌‌లకు కలిపి 7.99 లక్షల మంది రైతులు రూ.155.99 కోట్లు ప్రీమియం కట్టి ఫసల్‌‌ బీమా, వాతావరణ బీమా చేసుకున్నారు. మొత్తం రూ.545.55 కోట్లు  ప్రీమియం రూపంలో బీమా సంస్థలకు చెల్లించాల్సి ఉండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద రూ.389.56 కోట్లు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.194.78 కోట్లు ఇవ్వపోవడంతో కేంద్రం కూడా ఫండ్స్ రిలీజ్ చేయలేదు. ఆ యేడు పంట నష్టం క్లెయిమ్‌‌లు రూ.587.31 కోట్లు కాగా, 58 వేల మంది రైతులకు రూ.148.90 కోట్లు మాత్రమే అందాయి. ఇంకా రూ.438.41 కోట్ల పరిహారం అందాల్సి ఉంది. 2019–20లో రెండు సీజన్‌‌లు కలిపి 10.33 లక్షల మంది రైతులు రూ.239.48 కోట్లు ప్రీమియం కట్టారు. మొత్తం ప్రీమియం రూ.880.75 కోట్లు  చెల్లించాల్సి ఉంది. పంట నష్టం క్లెయిమ్‌‌లు రూ.402.28 కోట్లు కాగా ఇప్పటి వరకు పైసా అందలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద రూ.641.27 కోట్లు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.320.63 కోట్లు చెల్లించలేదు. దీంతో రైతులకు రూ.402.28 కోట్ల పరిహారం అందలేదు. ఇలా రెండేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.515.41 కోట్లు చెల్లించక పోవడంతో రూ.840.69 కోట్లు ఆగిపోయాయి.  
నిరుడు రూ.20 వేల కోట్ల నష్టం..  
నిరుడు వానాకాలంలో 1.32 కోట్ల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు.  నిరుడు జులై ఆగస్టు నెలల్లో, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వర్షాలకు 50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పెసర పంట పూర్తిగా, పత్తి 60 శాతం దెబ్బతిన్నాయి. కంది, సోయా పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వరిలో సన్న రకాలు ఎక్కువేస్తే 40 శాతం పంట తుడిచిపెట్టుకుపోయింది. ఇలా ఏటా పంటలు నష్టపోతున్నా.. రైతులకు పరిహారంతో భరోసా ఇచ్చే ప్రయత్నాలేవీ జరగడంలేదు.  
పంటనష్టానికి పైసా సాయంలేదు 
పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర సర్కార్‌‌ పైసా సాయం చేయడం లేదు. వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయిన రైతులు నిండా మునిగిపోయే పరిస్థితి నెలకొంది. పంట నష్టం జరిగితే ఇచ్చే ఇన్​పుట్ సబ్సిడీకి కూడా పైసా ఇవ్వలేదు.14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రకృతి విపత్తులతో పంటనష్టం జరిగితే ప్రభుత్వం పంట నష్టం లెక్కించి ఇన్‌‌పుట్‌‌ సబ్సిడీ పేరుతో పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఈ యేడు ప్రారంభంలో చెడగొట్టు వానలతో 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా బీమా లేకపోవడంతో నష్టపోయిన రైతులెవరికీ పరిహారం అందే అవకాశం లేకుండా పోయింది.