హైదరాబాద్, వెలుగు: ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వారి సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీలు ఇచ్చిందన్నారు.
రెండేళ్లయినా స్పందన లేకపోవడంతో చలో హైదరాబాద్కు చేరుకొని ఇందిరాపార్క్ వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తుంటే పోలీసులు మహిళలను లాఠీలతో కొట్టి గాయపర్చడం అమానవీయకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ. 18 వేలు నిర్ణయించాలని, కేంద్రం పెంచిన రు.1500 పారితోషికాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
