- బోనమెత్తిన మంత్రి కొండా సురేఖ,
- డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దమైన ఆషాడ బోనాల సంబురాలు ఆదివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఘనంగా జరిగాయి. పల్లె వాతావరణాన్ని తలపించేలా సాగిన ఈ వేడుకల్లో అమ్మవారి నామస్మరణతో ప్రజాభవన్ ప్రాంగణం మార్మోగింది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాల మధ్య ఉత్సవాలు కోలాహలంగా కొనసాగాయి. బోనాల ఉత్సవాల్లో తెలంగాణ ఆత్మను చాటిచెప్పేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ కట్టిపడేశాయి.
పసుపు కుంకుమలు, వేప మండలు ధరించిన మహిళల కోలాటం ఒకవైపు.. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు మరోవైపు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పు కళాకారుల దరువులతో ప్రజాభవన్ దద్దరిల్లింది. ముఖ్యంగా ప్రముఖ జోగిని శ్యామల తనదైన శైలిలో నృత్యాలు చేస్తూ వేడుకల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా ఆమె చేసిన సందడి, పోతురాజుల నృత్యాలు వీక్షకులను విశేషంగా అలరించాయి.
ఉత్సవాల్లో నలుగురు మంత్రుల సందడి
ఈ బోనాల వేడుకలలో నలుగురు మంత్రులు పాల్గొని సందడి చేశారు. రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులు కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. మంత్రి కొండా సురేఖ భక్తి భావంతో తలపై బోనం ఎత్తుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
అమ్మవారి సేవలో డిప్యూటీ సీఎం భట్టి దంపతులు
రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క భార్య నందిని సంప్రదాయబద్ధంగా, భక్తి భావంతో తలపై బోనం ఎత్తుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
