వేరొకామె అనుకుని ఈమెను మూడేళ్లు జైల్లో పెట్టారు

వేరొకామె అనుకుని  ఈమెను మూడేళ్లు జైల్లో పెట్టారు

గౌహతి: మధుబాల మండల్.. 59 ఏళ్ల అస్సాం మహిళ. ఏ కారణం లేకుండా మూడేళ్లపాటు ప్రభుత్వం బందీ చేసింది. ఫారినర్ అనే కారణంతో ఆమెను డిటెన్షన్​లో ఉంచారు. కారణం అధికారుల నిర్లక్ష్యం. విదేశీ ‘మధుబాల’ అనుకుని అస్సామీ మధుబాలను బందీగా తీసుకున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత తప్పు తెలుసుకుని ఆమెను విడుదల చేశారు. చిరాంగ్ జిల్లా బిష్ణుపూర్ లో ఉంటున్న మధుబాల దాస్, ఆమె భర్త మఖన్ దాస్ ఇద్దరూ విదేశీయులు అని 2016లో ఫారినర్స్ ట్రిబ్యునల్ నిర్ధారించింది. వారిని నిర్బంధంలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇవ్వడానికి చాలా రోజుల కిందటే వారు చనిపోయారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మధుబాల మండల్​ను మధుబాల దాస్​గా భావించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని డిటెన్షన్​లో ఉంచారు. అక్రమ వలసదారులను బందీగా ఉంచే కొక్రాఝర్ కేంద్రానికి తరలించారు.

అసలేం జరుగుతున్నదో తెలియక ఇన్నేళ్లు నిర్బంధంలోనే గడిపింది మధుబాల. చదువురాక, బయటికి ఎలా రావాలో తెలియక అక్కడే ఉండిపోయింది. యాక్టివిస్టుల చొరవతో.. విషయం తెలుసుకున్న యాక్టివిస్టులు మధుబాల తరఫున పోరాడారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ‘‘మధుబాల గురించి నాకు ఫిర్యాదు అందింది. దీనిపై నేను విచారణకు ఆదేశించాను. తప్పుగానే ఆమెను నిర్బంధించారనే నిజం వెల్లడైంది. దీంతో పోలీస్ హెడ్​క్వార్టర్స్​కు సమాచారం ఇచ్చాను. తర్వాత తప్పు సరిదిద్దేందుకు ఫారినర్స్ ట్రిబ్యునల్​ను ఆశ్రయించాను” అని చిరాంగ్ జిల్లా ఎస్పీ సుధాకర్ సింగ్ తెలిపారు. దీంతో మధుబాలను విడుదల చేయాలని ఈనెల 25న ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చిందని చెప్పారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం డిటెన్షన్ సెంటర్​నుంచి ఆమె బయటికి వచ్చింది. తన వయసు కన్నా ఎంతో పెద్దావిడగా కనిపించింది. బక్కచిక్కిపోయింది. వినికిడి లోపం ఉన్న తన కూతురిని కలిసింది.

గత నెలలో ‘కార్గిల్’ సైనికుడు..
కార్గిల్​యుద్ధంలో పోరాడిన సైనికుడు మొహమ్మద్ సనావుల్లాకూ కూడా ఇలానే జరిగింది. ఆయన ఫారినర్ అంటూ ట్రిబ్యునల్ ప్రకటించడంతో గత మే నెలలో గోవల్పారా జిల్లాలోని డిటెన్షన్ క్యాంప్​కు సనావుల్లాను తరలించారు. ఆయన కుటుంబసభ్యులు రిట్ పిటిషన్ వేయడంతో గౌహతి హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే డిటెన్షన్ క్యాంప్ నుంచి రిలీజ్ చేసింది. తాజాగా నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్​(ఎన్ఆర్​సీ) డ్రాఫ్టు నుంచి 1,02,462 మందిని తొలగించిన విషయం తెలిసిందే.