పదిహేడేండ్లకే రేడియో రిపేర్‌‌ పనులు నేర్చుకొని సొంతంగా షాప్‌ పెట్టిండు

పదిహేడేండ్లకే రేడియో రిపేర్‌‌ పనులు నేర్చుకొని సొంతంగా షాప్‌ పెట్టిండు

కోల్‌కతాలోని కుమార్తులిలో ఉంటాడు అమిత్ రంజన్ కర్మాకర్. చిన్నప్పటినుంచి రేడియోలో పాటలు, వార్తలు వినడం అలవాటు. ఆ ఇష్టంతోనే రేడియో మెకానిక్​ అయ్యాడు. పదిహేడేండ్లకే రేడియో రిపేర్‌‌ పనులు నేర్చుకొని సొంతంగా షాప్‌ పెట్టాడు. ఇప్పుడు ఇంటికొక టీవీ ఉన్నట్టే, ఆ రోజుల్లో ఇంటికొక రేడియో ఉండేది. వాటి రిపేర్లతో ఆయని షాప్ బాగా నడిచేది. దాంతో పాటు రకరకాల రేడియోల కలెక్షన్‌ చేసేవాడు. అయితే, 2000 సంవత్సరం నుంచి సీన్​ మారిపోయింది. అప్పుడే పాపులర్‌‌ అవుతున్న టీవీలు, మొబైల్‌ ఫోన్లు రేడియోని దెబ్బతీసాయి. దాంతో ఆయన షాప్‌ నడవడం కష్టమైంది. ఇల్లు గడవడం కోసం వేరే పనులు చేస్తూనే రోజూ షాప్‌ తెరిచేవాడు. 

అలా పాపులర్‌‌

ఈ షాప్‌ గురించి తెలుసుకున్న కొందరు ఫొటోగ్రాఫర్లు... థీమ్‌ ఫొటోగ్రఫీకోసం రేడియోలను అమిత్​ దగ్గర కిరాయికి తీసుకునేవాళ్లు. అప్పుడు షాప్‌లో ఉన్న రేడియోల గురించి అడిగి తెలుసుకునేవాళ్లు. అప్పుడే తన స్టోరీ అంతా వాళ్లకు చెప్పాడు అమిత్‌. అన్నేండ్లయినా తన పనిని విపరీతంగా ప్రేమిస్తున్న అమిత్‌ గురించి పేపర్‌‌లో వేయించారు ఆ ఫొటోగ్రాఫర్లు. అది చదివిన చాలామంది అమిత్‌కి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. 

కోల్‌కతాలో దుర్గాదేవి నవరాత్రుల్లో ప్రతిరోజూ ఉదయం మహిషాసుర మర్దిని కథ, అష్టోత్తరాలను టీవీ, రేడియోల్లో ప్రసారం చేస్తారు. మండపాల దగ్గర ఉండేవాళ్లకి వాటిని రేడియోలో వినాలనిపించింది. అందుకే వాళ్ల ఇండ్లల్లో చాలాకాలంగా వాడకుండా ఉన్న రేడియోలను తీసుకొచ్చి అమిత్‌ దగ్గర రిపేర్ చేయించుకోవడం మొదలుపెట్టారు. మిగతావాళ్లు కూడా అమిత్‌కి సాయం చేయాలని ఆయన దగ్గరికి లైన్ కడుతున్నారు. ‘మళ్లీ గిరాకీ పెరిగింది. ఫైనాన్షియల్‌గా కొంత సపోర్టు దొరికింద’ని సంతోషిస్తున్నాడు అమిత్‌.