రిటైర్డ్ ఎంప్లాయ్కు టోకరా ..రూ.20.20 లక్షలు కాజేసిన్రు

రిటైర్డ్ ఎంప్లాయ్కు టోకరా ..రూ.20.20 లక్షలు కాజేసిన్రు

బషీర్ బాగ్, వెలుగు: కొంత మంది సైబర్​ క్రిమినల్స్​ ఓ రిటైర్డ్ ఎంప్లాయ్ ఆధార్ కార్డు వాడుకొని మనీలాండరింగ్ పాల్పడ్డారు. అతడిని  భయపెట్టి రూ.లక్షల్లో టోకరా వేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి గురువారం తెలిపిన ప్రకారం.. కొద్దిరోజుల కిందట హైదరాబాద్​కు చెందిన ఓ రిటైర్డ్ ఎంప్లాయ్ కి ముంబై ఫెడెక్స్ ఎక్స్ ప్రెస్ ఆఫీసు నుంచి వాట్సాప్ కాల్ చేశారు. అతని ఆధార్ కార్డ్ పై నిషేధిత వస్తువులు తైవాన్ నుంచి పార్సిల్ బుకింగ్ అయినట్లు చెప్పారు.  అనంతరం ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ నుంచి అంటూ.. రిటైర్డ్ ఎంప్లాయ్​కు స్కైప్ ద్వారా మరో వీడియో కాల్ చేశారు. పోలీస్ అధికారులమని ఐడీ కార్డులు చూపించారు. 

మీ ఆధార్ కార్డు వాడుకొని ఓ వ్యక్తి వెస్ట్ బెంగాల్, కోల్​కతా, గోవా, బెంగళూరు, ముంబైలో మనీ లాండరింగ్ పాల్పడినట్లు, అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు భయపెట్టారు. ఇది రెండేళ్ల కిందటే జరిగిందని, అయితే.. అతను జైలులోనే ఉంటూ తన ముఠా సభ్యులతో నేరాలకు పాల్పడుతున్నారని, ఇప్పుడు ఆ ముఠా నుంచి మీకు, కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని రిటైర్డ్ ఎంప్లాయ్ ని బెదిరించారు. ఇలా స్కైప్ కాల్ కొనసాగుతుండగానే బాధితుడి మొబైల్ కు ముంబై పోలీస్ ఆర్థిక విభాగం నుంచి అంటూ మరో కాల్ వచ్చింది. 

దర్యాప్తు పూర్తి చేసేలోపు అతని అకౌంట్లలోని నగదును ఆర్ బీఐ ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేస్తే.. 7 రోజుల్లో మళ్లీ పంపిస్తారని అతన్ని నమ్మించారు. ఇది నిజమేననుకుని బాధితుడు సైబర్ క్రిమినల్స్ చెప్పిన అకౌంట్​కు రూ.20.20 లక్షలు ట్రాన్స్​ఫర్ చేశాడు. అనంతరం వారి నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో  మోసపోయానని తెలుసుకుని బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ శివమారుతి తెలిపారు.