అత్తాపూర్ కిడ్నాప్ కేసు ఉత్తిదే..!...సేప్గా ఇంట్లో ఉన్న యువతి: డీసీపీ శ్రీనివాస్

అత్తాపూర్ కిడ్నాప్ కేసు ఉత్తిదే..!...సేప్గా ఇంట్లో ఉన్న యువతి: డీసీపీ శ్రీనివాస్

గండిపేట, వెలుగు: అత్తాపూర్​లో కలకలం రేపిన యువతి కిడ్నాప్ వ్యవహారం పూర్తిగా అవాస్తవమని, ఆమె సురక్షితంగా తన ఇంట్లోనే ఉందని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి 10:55 గంటల సమయంలో పిల్లర్ నంబర్ 145 జాయ్ హాస్పిటల్ వద్ద ఒక యువతిని కారులో కిడ్నాప్ చేశారంటూ డయల్ 100కు ఫోన్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. 

అయితే, పోలీసు బృందాల విచారణలో ఆ యువతి తన సొంత ఇంట్లోనే ఉన్నట్లు తేలింది. ఎక్కడా కిడ్నాప్ జరిగినట్లు కానీ, బలవంతంగా తీసుకెళ్లినట్లు కానీ ఆధారాలు లేవని డీసీపీ తెలిపారు. కారులో ఉన్నవారంతా ఆ యువతికి తెలిసిన స్నేహితులేనని తేలిందని, ప్రస్తుతం యువతి స్టేట్​మెంట్​ను రికార్డ్ చేస్తున్నామని, ఆ తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ వెల్లడించారు.