ఈ ఐదింటిని గుర్తుంచుకోవాలి

ఈ  ఐదింటిని గుర్తుంచుకోవాలి

న్యూఢిల్లీ: నూతన సంవత్సరం కచ్చితంగా 2023 కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈసారి చాలా మార్పులు అమలు కాబోతున్నాయి. ఇవన్నీ అందరి జీవితాలపై ఎంతోకొంత ప్రభావం చూపిస్తాయి. కొత్త సంవత్సరంలో చిన్న పొదుపు పథకాలు ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. బీమా పాలసీ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఉపయోగంలో లేని యూపీఐ ఐడీలు డీ-యాక్టివేట్ అవుతాయి. కార్లు ఖరీదు అవుతాయి. సిమ్​కార్డు కోసం డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఫిజికల్ వెరిఫికేషన్ దశలవారీగా నిలిచిపోతుంది. ఈ మార్పులను మరింత వివరంగా అర్థం చేసుకుందాం.

నేటి నుంచి రాబోతున్న కీలక మార్పులివే

చిన్న పొదుపు పథకాలపై అధిక వడ్డీ రేటు

 సుకన్య సమృద్ధి ఖాతా పథకం వడ్డీ రేటు మార్చి క్వార్టర్​కు 20 బేసిస్ పాయింట్లు పెరిగి 8.20 శాతానికి చేరుకుంది. అలాగే, జనవరి 1, 2024 నుంచి ప్రారంభమయ్యే క్వార్టర్​కు 3 సంవత్సరాల కాల డిపాజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 7.10 శాతానికి చేరుకుంది. మిగతా పథకాల వడ్డీరేట్లు యదాతథంగా ఉంటాయి. పీపీఎఫ్​ వడ్డీరేటు కూడా మారదు.

కార్ల ధరలు పైకి 

టాటా మోటార్స్, ఆడి, మారుతీ,  మెర్సిడెస్ బెంజ్ వంటి చాలా ఆటో కంపెనీలు జనవరిలో తమ వాహనాల ధరలను పెంచుతామని ప్రకటించాయి. అధిక ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్ ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలియజేశాయి. ధరల పెంపు దాదాపు 2–-3 శాతం ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అయితే కొన్ని మోడళ్లకు అధిక ధరల పెంపు ఉండవచ్చని ఆటోమొబైల్​ ఎక్స్​పర్టులు అంటున్నారు. 

వాడని యూపీఐ ఐడీలు బంద్​ 

గూగుల్​పే, ఫోన్​పే, పేటీఎం వంటి  యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోని యూపీఐ ఖాతాను ఒక సంవత్సరం పాటు ఉపయోగించకుంటే, ఇక నుంచి అది పనిచేయదు. ఇలాంటి ఐడీలను జనవరి ఒకటో తేదీ నుంచే డీయాక్టివేట్​ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీని గురించి ఈ ఏడాది నవంబర్ ఏడో తేదీన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక  సర్క్యులర్​​ను కూడా జారీ చేసింది.  లావాదేవీని నిర్వహించని కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఫోన్ నంబర్లతో మోసాలు జరగకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కావాలంటే వాటిని మళ్లీ యాక్టివేట్​ చేసుకోవచ్చని పేర్కొంది. 

బీమా వివరాలు తెలుసుకోవడం ఈజీ

2024 జనవరి ఒకటో తేదీ నుంచి ఆరోగ్య బీమా పాలసీదారుల కోసం రివైజ్డ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను (సీఐఎస్​) విడుదల చేయాలని ఇన్సూరెన్స్​ రెగ్యులేటరీ డెవెలప్​మెంట్​ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్​డీఏఐ) ఇన్సూరెన్స్​ సంస్థలను ఆదేశించింది. కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పాలసీలోని ముఖ్య విషయాలను సులభంగా అర్థం చేసుకునేలా చేయడం దీని లక్ష్యం.  సులభమైన భాషలో అన్నింటినీ వివరించాలని స్పష్టం చేసింది. సీఐఎస్​లో సంక్లిష్టమైన, చట్టపరమైన పరిభాష ఉంటుంది కాబట్టి సాధారణ జనానికి అర్థం కాదు. సవరించిన షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పాలసీదారులకు సులభంగా అర్థమవుతాయి.

సిమ్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం నో ఫిజికల్​ వెరిఫికేషన్

మొబైల్ కనెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం సిమ్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కొనుగోలు చేసే విధానం మారుతుంది. వినియోగదారులు ఇక నుంచి కొత్త పద్ధతికి మారాలి. డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్​) తమ కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సిమ్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను విక్రయించే ముందు వారి ఫిజికల్ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దశలవారీగా తొలగించాలని టెలికమ్యూనికేషన్ కంపెనీలను ఆదేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నో యువర్​ కస్టమర్​ (కేవైసీ) వెరిఫికేషన్ పూర్తిగా డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తమ ఫోటో గుర్తింపు రుజువును చూపించి, డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వెరిఫికేషన్​  చేయించుకోవాలి.  సిమ్ కార్డ్ మోసాలను అరికట్టడానికి ఈ చర్య ఒక మార్గమని డాట్​ తెలిపింది.