
కడియం శ్రీహరి చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుకున్నాడని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. కడియం శ్రీహరి ఎందుకు పార్టీ మారారని ప్రశ్నించారు. రాబోయే మూడు నెలల్లో స్టేషన్ ఘన్ పూర్ లో ఉపఎన్నిక వస్తుందని.. రాజయ్య చేతిలో కడియం ఓటమి ఖాయమని చెప్పారు. తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే అవుతారని అన్నారు. హన్మకొండ చౌరస్తాలో జరిగిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు.
ఓరుగల్లు పోరుగల్లుగా మారితేనే తెలంగాణ వచ్చిందన్నారు కేసీఆర్. చరిత్ర వైభవానికి ప్రతీక వరంగల్ జిల్లా అని కొనియాడారు. ఓరుగల్లు మట్టితో తనది విడదీయరాని బంధమని చెప్పారు. తెలంగాణ వచ్చాక వరంగల్ జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ చరిత్ర, భూగోళం తెలియదని విమర్శించారు. ఏరి కోరి మొగుణ్ణి తెచ్చుకుంటే ఎగిరేగిరి తన్నట్లుంది తెలంగాణ పరిస్థితి అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దివాలా తీసిందన్నారు కేసీఆర్.
బీజేపీ చాలా ప్రమాద కరమైన పార్టీ అని అన్నారు కేసీఆర్. పదేళ్ల కిందట వంద నినాదాలు చెప్పిన మోదీ ఒక్కటైన నిజం చేశారా అని ప్రశ్నించారు. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవని చెప్పారు. వరంగల్ కు రావాల్సిన కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని మోదీ గుజరాత్ కు తరలించారని మండిపడ్డారు. బీజేపీకి దేశంలో 200 సీట్లు కూడా దాటేలా లేదన్నారు. కేంద్రంలో హంగ్ వస్తే.. పార్లమెంట్ లో బీఆర్ఎస్ కీలకం అవుతుందని తెలిపారు. తెలంగాణ కోసం కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు పార్లమెంట్ లో ఉండాలన్నారు. యువకుడు, ఉద్యమకారుడు సుధీర్‌కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.