దిగజారుతున్న‘ఆటోమొబైల్‘..21ఏళ్ల కనిష్టానికి సేల్స్

దిగజారుతున్న‘ఆటోమొబైల్‘..21ఏళ్ల కనిష్టానికి సేల్స్

న్యూఢిల్లీఆటోమొబైల్‌‌ సెక్టర్‌‌ పరిస్థితి నానాటికీ దిగజారుతూనే ఉంది. అమ్మకాలు ఆందోళనకరస్థాయిలో పడిపోతున్నాయి. గత నెల అన్ని రకాల వాహనాల అమ్మకాలు దారుణంగా దిగజారాయి. ప్యాసింజర్‌‌ వెహికిల్స్‌‌, టూవీలర్స్‌‌కు గిరాకీ కొంచెం కూడా పెరగలేదు. అమ్మకాలు 20 ఏళ్ల కనిష్టస్థాయికి పడిపోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. డిమాండ్‌‌లో ఇంతటి పతనాన్ని ఎప్పుడూ చూడలేదని సొసైటీ ఆఫ్‌‌ ఇండియన్‌‌ ఆటోమొబైల్‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌‌ (సియామ్‌‌) పేర్కొంది. టూవీలర్లు, కమర్షియల్‌‌ వెహికిల్స్‌‌ (సీవీలు), ప్యాసింజర్‌‌ వెహికిల్స్‌‌ (పీవీలు) అమ్మకాలు 2018 ఆగస్టులో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 23.55 శాతం తగ్గాయి. జూలైలోనూ అమ్మకాలు 18.71 శాతం పడిపోయాయి. ఇది 19 ఏళ్ల కనిష్టమని సియామ్‌‌ తెలిపింది. దేశీయ ప్యాసింజర్‌‌ వెహికిల్స్‌‌ సేల్స్‌‌ ఏకంగా 31.5 శాతం తగ్గాయి. ఈ విభాగంలో అమ్మకాలు వరుసగా పది నెలల నుంచి తగ్గుతూనే ఉన్నాయి. మార్కెట్ లీడర్‌‌ మారుతీ సుజుకీ ఆగస్టులో కేవలం 93 వేల పీవీలను అమ్మింది. హ్యుండై అమ్మకాలు 17 శాతం, మహీంద్రా అమ్మకాలు 32 %  తగ్గాయి.

ప్యాసింజర్‌‌ కార్ల అమ్మకాలు

ప్యాసింజర్‌‌ కార్ల గిరాకీ కూడా గణనీయంగా పడిపోయింది. గత ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో అమ్మకాలు 41 శాతం తగ్గాయి. ఇదేకాలంలో టూవీలర్ల అమ్మకాలు 22 శాతం, సీవీల అమ్మకాలు 39 శాతం తగ్గాయి. టూవీలర్ సెగ్మెంట్‌‌ మార్కెట్‌‌ లీడర్‌‌ హీరో మోటోకార్ప్‌‌ సేల్స్‌‌ 21 శాతం తగ్గి 5.24 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. హోండా అమ్మకాలు 26 శాతం పడిపోయాయి. టీవీఎస్‌‌ మోటర్స్‌‌ అమ్మకాలు 20 శాతం క్షీణించాయి. అయితే ఆగస్టు రిటైల్‌‌ అమ్మకాలు మాత్రం కాస్త మెరుగ్గా ఉన్నాయి. స్టాక్స్‌‌ను తగ్గించడానికి పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇవ్వడమే ఇందుకు కారణం. గత ఆగస్టుతో పోలిస్తే ఈసారి అమ్మకాలు నాలుగుశాతమే తగ్గాయి. పీవీల అమ్మకాలు 7.13 శాతం పడిపోయాయి. టూవీలర్ల రిటైల్‌‌ సేల్స్‌‌లో 3.4 శాతం తగ్గుదల రికార్డయింది. డీలర్ల నుంచి డిమాండ్‌‌ లేకపోవడంతో ఫ్యాక్టరీలు వాహనాల డిస్పాచెస్‌‌ను తగ్గిస్తున్నారు. 2018 ఆగస్టుతో పోలిస్తే డిస్పాచెస్‌‌ 23.55 శాతం తగ్గి 1,821,490 యూనిట్లుగా నమోదయ్యాయి.

జీఎస్టీని తగ్గించాల్సిందే..

కొన్ని మోడల్స్‌‌ రూ.లక్షల్లో డిస్కౌంట్లు ఇస్తున్నా అమ్మకాలు పెరగడం లేదని, స్టాక్‌‌లు పేరుకుపోతున్నాయని కంపెనీలు, డీలర్లు చెబుతున్నారు. వాహనాలకు డిమాండ్‌‌ పెంచాలంటే అమ్మకాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం తప్ప వేరే మార్గమేమీ లేదని సియామ్‌‌ స్పష్టం చేసింది. డిమాండ్‌‌ లేకపోవడంతో ఆటో కంపెనీలు ఇది వరకే 15 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాయి. దేశవ్యాప్తంగా డీలర్లు 2.8 లక్షల మందిని తొలగించారు. ఈ పరిస్థితిపై కేంద్రమంత్రులు నితిన్‌‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్ స్పందిస్తూ జీఎస్టీ తగ్గింపు ప్రతిపాదనను తప్పక పరిశీలిస్తామన్నారు. జీఎస్టీని తగ్గించే అధికారం పూర్తిగా తన చేతుల్లో లేదని, జీఎస్టీ మండలి భేటీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని నిర్మల అన్నారు. పెట్రోల్‌‌, డీజిల్‌‌ వాహనాలను నిషేధించబోమని, వీటికీ ప్రోత్సాహకాలు ఇస్తామని నితిన్‌‌ గడ్కరీ ఇటీవల హామీ ఇచ్చారు.

ఇవీ కారణాలు

  •    కొన్ని ప్రాంతాల్లో వర్షాలు సరిగ్గా కురవలేదు. అట్లాగే చాలా రాష్ట్రాల్లో వరదలు రావడంతో డిమాండ్‌‌ తగ్గింది.
  •    పోటీ విపరీతంగా పెరిగింది. ఒకే వీధిలో రెండుమూడు షోరూమ్‌‌లు ఏర్పాటు కావడంతో అమ్మకాలు తగ్గాయి.
  •    జీఎస్టీ కారణంగా వాహనాల ధరలు విపరీతంగా పెరిగాయి. విడిభాగాల ధరలూ అధికమయ్యాయి.

మాన్యుఫ్యాక్చర్‌‌ రంగం కల్పించే ఉద్యోగాల్లో సగం ఆటో సెక్టార్‌‌ ఇచ్చేవే ఉంటాయి. గిరాకీ లేక కంపెనీలు, డీలర్లు లక్షలాది మందిని తొలగించారు. ఉద్యోగులను కాపాడాలి. ప్యాసింజర్‌‌ వెహికిల్స్‌‌ అమ్మకాలు 20 కనిష్టానికి పడిపోయాయి. ఆటో సెక్టార్‌‌నే కాదు ఉద్యోగులనూ రక్షించడానికీ చర్యలు అవసరం. జీఎస్టీ విధింపులో మార్పులు అవసరం.

-కిరణ్‌‌ మజుందార్‌‌ షా, బయోకాన్‌‌ సీఎండీ