ట్విన్ టవర్స్ కూల్చివేతతో ఆరోగ్యానికి ముప్పు

ట్విన్ టవర్స్ కూల్చివేతతో ఆరోగ్యానికి ముప్పు

100 మీటర్ల పొడవైన సూపర్‌టెక్ ట్విన్ టవర్లను అధికారులు నేలమట్టం చేశారు. ఎమరాల్డ్ కోర్టు సొసైటీ ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వీటిని తొలగించారు. ఈ జంట భవనాలను కూల్చివేయడంతో శిథిలాలన్నీ ఓ పర్వతంలా పేరుకుపోయాయి. కాగా ఈ తొలగింపు ప్రక్రియకు అధికారులు దాదాపు 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడి వాతావరణమంతా  దుమ్ము, దూళితో నిండిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ నివసించే వారికి డాక్టర్లు పలు సూచనలు చేస్తున్నారు. 

ఈ భవనాలు నేలమట్టం కావడంతో సమీపంలో నివసించే ప్రజలు, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వీలైతే కొన్ని రోజులు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దాదాపు 100 మీటర్ల పొడవైన నిర్మాణాలను కూల్చివేయడం వల్ల 80,000 టన్నుల శిథిలాలు,  కూల్చివేత వ్యర్థాలు ఉత్పన్నమయ్యాయని సమాచారం. బలమైన గాలులు, వర్షం వంటి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు లేనప్పుడు కొన్ని రోజుల పాటు గాలిలో ఈ దుమ్ము కణాలు ఉండే అకాశముందని డాక్టర్లు అంటున్నారు. ఈ దుమ్ము కాలుష్యంతో కళ్ళు, ముక్కు, చర్మం మీద దురదకు దారితీస్తుందని చెప్పారు. తద్వారా దగ్గు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, ముక్కు దిబ్బడ, ఆస్తమా దాడులు, గుండె సమస్యలను తీవ్రతరం చేస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. 

ఆ ప్రాంతంలో, చుట్టుపక్కల నివసించే వారు కొన్ని రోజులు పాటు వ్యాయామాలకు దూరంగా ఉంటే మంచిదని కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఇక శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడాలని, సమస్యలు తీవ్రమైతే వైద్యులను సంప్రదించాలన్నారు. కాలుష్య కారకాలు గాలిలో ఉన్నంతకాలం N-95 మాస్క్‌లు, కళ్లద్దాలు, ఫుల్ స్లీవ్ దుస్తులను ధరించాలన్నారు. గాలి నాణ్యతను అధికారులు పర్యవేక్షించాలని, అనివార్య పరిస్థితుల్లో తప్ప మరెప్పుడూ బయటికి రాకూడని సూచిస్తున్నారు. భవన నిర్మాణాల కూల్చివేతల ఏర్పడిన కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. నోయిడా అధికారులు సెన్సార్ల సహాయంతో చెత్తను తొలగించే వరకు వాయు కాలుష్య స్థాయిని గమనించాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎయిర్ ల్యాబ్ మాజీ చీఫ్ డాక్టర్ దీపాంకర్ సాహా చెప్పుకొచ్చారు,