బైరి నరేష్ పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు

బైరి నరేష్ పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు

ఆగని ఆందోళనలు

నెట్​వర్క్, వెలుగు : హిందూ దేవుళ్ల జోలికొస్తే ఊరుకునేది లేదని అయ్యప్ప భక్తులు, బీజేపీ, హిందూవాహిని, వీహెచ్‌‌పీ, భజరంగ్ దళ్ నేతలు హెచ్చరించారు. అయ్యప్ప స్వామిపై నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేశ్​​వ్యాఖ్యలకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. నరేశ్​ అరెస్టులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. నరేశ్​ పై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్​ చేశారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో శనివారం ఉదయం నుంచే అయ్యప్ప భక్తులు రోడ్ల మీదకొచ్చి ఎక్కడికక్కడ ధర్నాలు చేపట్టారు. వారికి హిందూ సంస్థలు, ఇతర సం ఘాలు మద్దతు తెలిపాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భజరంగ్‌‌దళ్‌‌, వీహెచ్‌‌పీ, హిందూ పరిరక్షణ సమితితో పాటు అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. సూర్యాపేట, హుజూర్‌‌నగర్‌‌, నేరేడుచర్ల, గరిడేపల్లి, యాదగిరిగుట్ట, నల్గొండ పట్టణంలో ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించి నరేశ్​ దిష్టిబొమ్మను దహనం చేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చలువాయిలో పార్టీలకు అతీతంగా నేషనల్ హైవేపై గంట పాటు ఆందోళన చేశారు. నరేశ్​ కు బుద్ధి ప్రసాదించాలని హనుమకొండలో వీహెచ్ పీ ప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. జనగామలో జేఏసీ లీడర్లు నరేశ్​ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాల వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. జగిత్యాలలో అయ్యప్ప భక్తులు మెయిన్ రోడ్డమీద బైఠాయించారు. 

నరేశ్​ సొంతూరులో ఉద్రిక్తత  

బైరి నరేశ్​ ఇంటి ముట్టడికి అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు శనివారం పిలుపునివ్వడంతో ఆయన సొంతూరు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రాములపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. నరేశ్​ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోగా, పోలీసులు  బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ లీడర్లు,  హిందూ సంఘాల నాయకులు నరేశ్​​ ఇంటి వద్దకు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అయ్యప్ప సేవా సమితి సభ్యులు కన్నూరు గ్రామ పంచాయతీ ఎదుట ఆందోళనకు దిగారు. కాగా, నరేశ్​ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ పోస్టులు పెట్టిన అతడి బంధువు బైరి అగ్నితేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అగ్నితేజ కోసం గాలిస్తున్నారు.