హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ పదేళ్ల రాక్షస పాలనలో నిరుద్యోగుల బతుకులు ఆగమయ్యాయని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో కొలువుల జాతర మొదలైందని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ అన్నారు. శనివారం గాంధీభవన్ లో విద్యార్థులు, నిరుద్యోగులకు బీఆర్ఎస్ చేసిన ద్రోహంపై ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో 16 సార్లు పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల ఉసురుపోసుకున్న నేతలకు ఉద్యోగాలపై మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు.
నాడు నిరుద్యోగులకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని వారు, అధికారం పోగానే రాజకీయ స్వార్థం కోసం కపట ప్రేమ చూపిస్తున్నారని, వారి ట్రాప్లో ఎవరూ పడొద్దని హెచ్చరించారు. ఇప్పటికే తమ ప్రభుత్వం 80 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఎస్సీ వర్గీకరణ, కోర్టు కేసులు వంటి కారణాలతో కొన్ని నోటిఫికేషన్లు ఆలస్యమైనా.. మరో 30 వేల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపారు. తాను కూడా నిరుద్యోగులతో కలిసి ఉద్యమాలు చేసిన వ్యక్తినేనని, ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య వారధిగా ఉండి ప్రతి సమస్యను పరిష్కరిస్తానని బల్మూరి వెంకట్ భరోసా ఇచ్చారు.
