హైదరాబాద్, వెలుగు: పోక్సో కేసులో బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. భగీరథ్ ఇప్పటికే అరెస్టు కావడంతో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంటూ ఆయన తరఫు న్యాయవాది హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ అందజేశారు. ఈ వినతిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం విచారణ జాబితాలో ఈ కేసును ‘పిటిషన్ ఉపసంహరణ’కేటగిరీలో నమోదు చేశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలతో నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై గత శుక్రవారం అర్ధరాత్రి వరకు వాదనలు సాగాయి. విచారణ అనంతరం ఈ నెల 21న తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. అప్పటివరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్న భగీరథ్ తరఫు న్యాయవాది విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది.
బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలంలోని ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొంటూ మధ్యంతర రక్షణ ఇవ్వబోమని స్పష్టం చేసింది. దీంతో భగీరథ్ శనివారం పోలీసులకు లొంగిపోయారు. నిందితుడు అరెస్టు కావడంతో ముందస్తు బెయిల్ అనవసరమని భగీరథ్ తరఫు న్యాయవాది చెప్పడంతో పిటిషన్‌ను వాపస్ తీస్కునేందుకు అనుమతిస్తూ గురువారం హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది.
