- కేంద్ర సహాయ మంత్రి సంజయ్
రాజన్న సిరిసిల్ల, వెలుగు : దివ్యాంగులకు త్వరలోనే ఉపకరణాలు అందజేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఇండియన్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్ సీఎస్ఆర్ కింద దివ్యాంగులకు రూ. 83 లక్షల విలువైన 813 ఉపకరణాలు సమకూర్చగా.. వాటిని గురువారం సిరిసిల్లలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి రూ. 1,600 కోట్లు ఖర్చు చేసిందన్నారు. సర్కార్ స్కూళ్లలో ప్రవేశాలు పెరగాలని, డ్రాప్ ఔట్స్ లేకుండా చూసుకోవాలని ఇందుకు ప్రభుత్వ టీచర్లు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది కూడా సైకిళ్లు అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ... సుగమ్య భారత్ – స్వశక్త భారత్‌లో భాగంగా దేశ నిర్మాణం, అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలిపునిచ్చారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌లో 10 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. ఎస్పీ మహేశ్ బి.గీతే మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూపారాణి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఐఓసీఎల్ సీజీఎం వినీత్, సీఎస్‌ఆర్ హెడ్ కైలాస్ కాంత్ పాల్గొన్నారు.
