హైదరాబాద్, వెలుగు: ప్రముఖ శిల్పి, చిత్రకారుడు డా. హోతి బస్వరాజ్ మూడు దశాబ్దాల కళా ప్రస్థానాన్ని ప్రతిబింబించే ‘బసవ’ ఏకవ్యక్తి కళా ప్రదర్శన ఆదివారం హైదరాబాద్‌లోని స్టేట్ గ్యాలరీలో ప్రారంభమైంది. జహీరాబాద్ ఎంపీ సురేశ్షెట్కార్, మాజీ ఎంపీ బీబీ పాటిల్ కలిసి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ సురేశ్షెట్కార్ మాట్లాడుతూ తమ న్యాల్కల్ ప్రాంతానికి చెందిన డా. హోతి బస్వరాజ్ కళాఖండాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు.
ఉర్సు ఉత్సవాల్లో ఉత్తమ జోడెద్దులను ప్రోత్సహిస్తూ బస్వరాజ్ అందించే బహుమతులు ఆయనకు ఎద్దులపై ఉన్న అభిమానాన్ని చూపిస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా ‘బసవరాజీవం’ గ్రంథాన్ని ఎంపీ ఆవిష్కరించారు. ప్రదర్శన క్యూరేటర్ డా. ద్యావనపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ బసవ, పుంజు విజయం, సెల్ఫీ వంటి కళాఖండాలు బస్వరాజ్ ప్రత్యేక శైలిని ప్రతిబింబిస్తాయని చెప్పారు. ప్రతి కళాఖండం వెనుక సామాజిక, సాంస్కృతిక సందేశం ఉందన్నారు. ఈ ప్రదర్శన ఈ నెల 30 వరకు కొనసాగుతుందని తెలిపారు.
