రోజుకి మూడునాలుగుసార్లు స్నానం.. మంచిదా? కాదా?

రోజుకి మూడునాలుగుసార్లు స్నానం.. మంచిదా? కాదా?

ప్రతిరోజూ అందరూ స్నానం చేస్తారు. కానీ, ఆ అందరిలో  కొందరు మాత్రం..హైజీన్​ పేరుతో రోజుకి మూడునాలుగుసార్లు స్నానం చేస్తుంటారు. ఆ అలవాటు మంచిదా? కాదా? అని పరాస్​ హాస్పిటల్స్​ సీనియర్​ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్​ డాక్టర్​ వినయ్​ సింగ్​ని అడిగితే.. ముమ్మాటికి కాదనే అంటున్నారు. కాకపోతే స్నానం చేసేటప్పుడు ఈ ఐదు రూల్స్​ని గుర్తుంచుకుంటే ఎన్నిసార్లు స్నానం చేసినా నష్టం లేదంటున్నాడు. అవేంటంటే..  

  • ‘ఎవిడెన్స్​​– బేస్డ్​ కాంప్లిమెంటరీ అండ్​ ఆల్టర్నేటివ్ మెడిసిన్’  స్టడీ 2018 లో పబ్లిష్​ అయింది. దీని ప్రకారం.. రెండుపూటలా స్నానం చేస్తే ఒత్తిడి దరిచేరదు. బాడీ రిలాక్స్​ అవడంతో పాటు కంటినిండా నిద్ర పడుతుంది. అన్నింటికి మించి హ్యాపీ హార్మోన్స్​ రిలీజ్​ అవుతాయి. కానీ, ఎక్కువసార్లు స్నానం చేస్తే ఈ లాభాలు అటుంచితే.. చర్మానికి లేనిపోని చిక్కులు వచ్చిపడతాయి. అలాకాకూడదంటే.. స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. 
  • చల్లటి వాతావరణంలో వేడి నీళ్లతో.. ఉక్కపోతలో చల్లటి నీళ్లతో స్నానం చేస్తుంటారు చాలామంది. కానీ, కాలమేదైనా గోరు వెచ్చని నీళ్లతోనే స్నానం చేయాలి. ఎక్కువసార్లు స్నానం చేసేవాళ్లు ఈ రూల్​ కచ్చితంగా ఫాలో అవ్వాలి. దీనివల్ల బాడీ టెంపరేచర్​ పెరుగుతుంది.. ఫలితంగా  కండరాలు రిలాక్స్​ అవుతాయి. స్ట్రెస్​, ఒంటి నొప్పులు తగ్గుతాయి. శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. నిద్ర పడుతుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేస్తే .. వెంటనే రిలీఫ్​ వస్తుంది. పైగా గోరు వెచ్చని నీళ్లు శరీరాన్ని  బాగా శుభ్రం చేస్తాయి. అలా కాదని  బాగా వేడెక్కిన లేదా చల్లటి నీళ్లతో  పదేపదే స్నానం చేస్తే చర్మం పొడిబారుతుంది. దద్దుర్లు​ వస్తాయి. చర్మంపై పగుళ్లు ఏర్పడతాయి. 
  • రోజుకి ఎన్నిసార్లు స్నానం చేస్తున్నామన్న విషయంతో పాటు.. ఎంతసేపు చేస్తున్నామన్నది కూడా ఇంపార్టెంట్​.  అయితే గంటలు తరబడి స్నానం చేయడం వల్ల స్కిన్​లోని నేచురల్​ ఆయిల్స్​ పోతాయి. చర్మ రంధ్రాలు వెడల్పు అవుతాయి. చర్మం పొడిబారి, దురద పెడుతుంది. అందుకే స్నానం పదినిమిషాలకి మించి చేయకూడదు. ఎక్కువసార్లు స్నానం చేసేవాళ్లు.. ఇంతకన్నా తక్కువ టైంలో  కంప్లీట్​ చేస్తే మరీ మంచిది. 
  • ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల చర్మం ఇరిటేట్​ అవుతుందన్నది తెలిసిందే.  లూఫా లేదా బ్రష్​తో  చర్మాన్ని రుద్దడం వల్ల ఆ సమస్య మరింత పెరుగుతుంది. అలాకాకూడదంటే స్నానానికి సున్నితమైన సబ్బులు, బాత్​ ప్రొడక్ట్స్, బాడీ క్లెన్సర్స్​ని మాత్రమే వాడాలి.
  • స్నానం చేశాక బాడీకి మాయిశ్చరైజర్​ రాయడం కూడా చాలా ముఖ్యం. మాయిశ్చరైజర్​కి బదులు గ్లిజరిన్​ని బాడీకి పట్టించొచ్చు. ఇవేమీ వద్దనుకుంటే.. ఇంట్లో ఉండే నెయ్యి, కొబ్బరి, ఆలివ్​ నూనెల్ని​​ నేచురల్​ మాయిశ్చర్స్​గా వాడొచ్చు. ఇవి రాయడం వల్ల ఎన్నిసార్లు స్నానం చేసినా బాడీకి  నష్టం ఉండదు.
  • చర్మాన్ని హైడ్రేటెడ్​గా,  శుభ్రంగా ఉంచడానికే స్నానం.. అయితే స్నానం చేసే బాత్​రూమ్​ శుభ్రంగా లేకపోతే చర్మం మరింత మురికి అవుతుంది. అందుకే బాత్​రూమ్​ షెల్ఫ్​లు, కప్​బోర్డులు, సబ్బు పెట్టెలు, టవల్స్​ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే స్కిన్​తో కాంటాక్ట్​ అయ్యే ప్రతి వస్తువుని క్లీన్​గా పెట్టుకోవాలి.