జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్కు బెయిల్

జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్కు  బెయిల్

జెట్ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్నందున వైద్యం కోసం బెయిల్ మంజూరు చేయాలని నరేష్ గోయల్ వేసిన పిటిషన్ ను విచారించిన ముంబై హైకోర్టు..రెండు నెలల మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన గోయల్ ఇప్పుడు తాత్కాలికంగా విడుదల కానున్నారు.జస్టిస్ ఎన్‌జే జమాదర్‌తో కూడిన సింగిల్ బెంచ్ రూ. లక్ష పూచీకత్తుతో గోయల్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా ముంబై దాటి వెళ్లొద్దని, తన పాస్ పోర్టు ను అప్పగించాలని ఆదేశించింది. 

75 ఏళ్ల వయసులో నరేష్ గోయల్, అతని భార్య అనితా గోయల్ క్యాన్సర్ తో బాధపడుతున్నందున చికిత్స చేయించుకునేందుకు బెయిల్ ఇవ్వాలని ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఫిబ్రవరిలో కూడా బెయిల్ కోసం పిటిషన్ వేయగా కోర్టు తిరస్కరించింది. గోయల్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే ..మానవతా ప్రాతిపదికన అతనిని విడుదల చేయాలని కోర్టును కోరారు. గోయల్ , అతని భార్య ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఎదుర్కొంటున్న శారీరక, మానసిక ఇబ్బందులను కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు గోయల్ కు బెయిల్ మంజూరు చేసింది. 

కెనరా బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని ఎగ్గొట్టిన మనీలాండరింగ్ కేసులు నరేష్ గోయల్ విచారణ ఎదుర్కొంటున్నారు. 2023 సెప్టెంబర్ లో నరేష్ గోయల్ ను అరెస్ట్ చేసి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. కెనరా బ్యాంక్ నుంచి 848.86 కోట్ల అప్పు తీసుకున్న నరేష్ గోయల్ 538.62 కోట్ల రుణాలను ఎగ్గొట్టినట్లు బ్యాంక్ నరేష్ గోయల్ పై ఫిర్యాదు చేసింది. ఈ కేసులో గోయల్ భార్య అనితా గోయల్ ను కూడా 2023 నవంబర్ లో అరెస్ట్ చేశారు.