ఓసీ జనాభాపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు : గోపు జయపాల్‍రెడ్డి

ఓసీ జనాభాపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు :  గోపు జయపాల్‍రెడ్డి
  • ఓసీల్లోని పేదలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు
  • రెడ్డి, వైశ్య కార్పొరేషన్‌‌‌‌ ఏర్పాటు చేయాలి
  • ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జయపాల్‍రెడ్డి 

వరంగల్‍, వెలుగు : ‘రాష్ట్రంలో ఓసీ జనాభా 10 శాతమే ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నరు.. రెడ్డి, వెలమ, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, మార్వాడి సామాజికవర్గాలు కలుపుకొని మొత్తం 30 శాతం జనాభా ఉన్నాం’ అని ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జయపాల్‍రెడ్డి చెప్పారు. ఓసీల్లోని పేదలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని.. పోరాడి హక్కులను సాధించుకోవాలని సూచించారు. హనుమకొండలోని ఆర్ట్స్‌‌‌‌ అండ్‌‌‌‌ సైన్స్‌‌‌‌ కాలేజీ గ్రౌండ్‌‌‌‌లో ఆదివారం ఓసీల సింహగర్జన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయపాల్‍రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓసీల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్‌‌‌‌ ఎన్నికల్లో ప్రతి 100 మందిలో 13 మంది మాత్రమే ఓసీలకు అవకాశం ఉచ్చిందన్నారు. రెడ్డి, వైశ్య కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌‌‌‌ ఆ తర్వాత పట్టించుకోలేదని ఆరోపించారు. కార్పొరేషన్ల ఏర్పాటుకు కాంగ్రెస్‍ సైతం హామీ ఇచ్చింది తప్పితే ఇంకా ఆ దిశగా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఓసీల హక్కుల సాధనే లక్ష్యంగా త్వరలోనే హైదరాబాద్‌‌‌‌లో లక్షలాది మందితో సభ నిర్వహిస్తామని ప్రకటించారు.

అనంతరం జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్‌‌‌‌ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యూఎస్‌‌‌‌ పరిమితి రూ. 10 లక్షలకు, గడువును ఐదేండ్లకు పెంచడంతో పలు తీర్మానాలు చేశారు. సభలో వరంగల్‌‌‌‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌‌‌‌రెడ్డి, ఓసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్‍, ట్రెజరర్‌‌‌‌ నాడిపల్లి వెంకటేశ్వర్‍, ఈడబ్ల్యూఎస్‌‌‌‌ జాతీయ చైర్మన్‌‌‌‌ నల్ల సంజీవ్‍రెడ్డి, జేఏసీ గౌరవ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, గంగు ఉపేంద్రశర్మ, బీజేపీ నాయకుడు తక్కెళ్లపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు.