మియాపూర్, వెలుగు: మియాపూర్ మక్త మహబూబ్‌పేట్ గ్రామ పరిధిలోని హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేతలు, ఫెన్సింగ్ పనులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాచుపల్లి–మియాపూర్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 44లోని ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా అధికారులు ఆదివారం ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు.
మరో సర్వే నంబర్ పత్రాలతో ఇక్కడ ఎకరంన్నర భూమిని కబ్జా చేసి రిజిస్ట్రేషన్లు చేశారని, మిగిలిన భూమిని నకిలీ డాక్యుమెంట్లతో కబ్జాకు ప్రయత్నించినట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఈ నేపథ్యంలో 15 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా అధికారులు ఫెన్సింగ్ పనులు చేపట్టగా స్థానికులు అడ్డు తగిలారు. అనంతరం ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం ఏంటని మండిపడ్డారు.
