‘వీబీ-జీ రామ్ జీ’పై దుష్ప్రచారం : రాంచందర్ రావు

‘వీబీ-జీ రామ్ జీ’పై దుష్ప్రచారం : రాంచందర్ రావు
  • 40% నిధులిచ్చేందుకు రాష్ట్ర సర్కార్​కు ఏడుపెందుకు?: రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: దేశంలో అవినీతిని అంతం చేసి, పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్రం కొత్త చట్టాలు తెస్తుంటే.. అక్రమాలకు చాన్స్ ఉండదన్న భయంతోనే కాంగ్రెస్ వణికిపోతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. యూపీఏ హయాంలో ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పట్టాయని, ఆ లీకేజీలను అరికట్టేందుకే మోదీ సర్కార్ ‘వీబీ–జీ రామ్ జీ’ చట్టాన్ని తెస్తున్నదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ‘వీబీ–జీ రామ్ జీ’పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడారు. 

కాంగ్రెస్ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేదని, మోదీ వచ్చాక 4వ స్థానానికి వచ్చిందని.. త్వరలోనే టాప్–3కి వెళ్తామని వివరించారు. ఈ మార్పును కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నదని.. అందుకే మోదీ తెచ్చే ప్రతి పథకాన్ని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఆయన స్క్రిప్టునే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చదువుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఉపాధికి కేవలం లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. మోదీ వచ్చాక 8 లక్షల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు.

రాష్ట్రాల భాగస్వామ్యం పెంచుతున్నం

ఉపాధి పథకంలో రాష్ట్రాల భాగస్వామ్యం, బాధ్యత పెంచేందుకే 60:40 నిష్పత్తిని కేంద్రం తెచ్చిందని రాంచందర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 40 శాతం నిధులు ఇవ్వడానికి ఎందుకు ఏడుస్తున్నదని, ఆ డబ్బులు ఇస్తున్నది ప్రజలకే తప్ప మోదీకి కాదు కదా? అని ప్రశ్నించారు. 

మోదీకి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కొత్త చట్టంపై కాంగ్రెస్ లీడర్లు గ్రామాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని, దీన్ని బీజేపీ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మరోవైపు, రాంచందర్‌‌ రావుకు స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు 2026ను మేధావుల ఫోరం ప్రతినిధులు అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానంద సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచ వేదికపై ఎలుగెత్తి చాటారన్నారు. యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడపాలని, దేశ సమగ్రత కోసం తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.