కోయంబత్తూర్‌లో పొంగల్ వేడుకలు..సంక్రాంతి సంస్కృతి.. ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీక: పొంగులేటి

కోయంబత్తూర్‌లో పొంగల్ వేడుకలు..సంక్రాంతి సంస్కృతి.. ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీక: పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: తమిళనాడు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా కోయంబత్తూర్‌లో ‘నమ్మ ఊరు మోదీ పొంగల్’ వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. బీజేపీ తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సహ ఇన్‌చార్జ్ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబురాలకు బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదని, ప్రకృతికి, వ్యవసాయానికి కృతజ్ఞత తెలిపే గొప్ప సందర్భమని అన్నారు. సామాజిక సామరస్యానికి, భిన్నత్వంలో ఏకత్వానికి పొంగల్ నిదర్శనమన్నారు. 

ప్రధాని మోదీ కలలుగన్న ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తి ఈ పండుగలో కనిపిస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతిని కాపాడుతూనే, జాతీయ విలువలైన అభివృద్ధి, స్వయం సమృద్ధిని ప్రజలకు చేరువ చేసేందుకే బీజేపీ ఈ వేడుకలను నిర్వహిస్తున్నదని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో బీజేపీ తమిళనాడు స్టేట్ చీఫ్​ నైనార్ నాగేంద్రన్, రాష్ట్ర ఇన్​చార్జి అరవింద్ మీనన్, మాజీ గవర్నర్ తమిళిసై, పార్టీ స్టేట్​ మాజీ చీఫ్​ అన్నామలై పాల్గొన్నారు.