అగ్రరాజ్యాల ఆధిపత్య నియంత్రణకు చిన్నదేశాలన్నీ ఏకం కావాలి : మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి. రాధారాణి

అగ్రరాజ్యాల ఆధిపత్య నియంత్రణకు చిన్నదేశాలన్నీ ఏకం కావాలి : మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి. రాధారాణి
  •     హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి. రాధారాణి
  •     భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం రాష్ట్ర రెండో మహాసభ ప్రారంభం 

హైదరాబాద్, వెలుగు: చమురు వనరులు, డాలర్లపై అగ్రరాజ్యాల ఆధిపత్యం, నియంతృత్వం ఎంతోకాలం కొనసాగదని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి. రాధారాణి అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని గ్రీన్ ల్యాండ్స్ టూరిజం ప్లాజాలో భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కఫ్) రాష్ట్ర రెండో మహాసభ జరిగింది. 

ఈ సదస్సుకు ఇస్కఫ్ రిసెప్షన్ కమిటీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది కడారు ప్రభాకర్ రావు అధ్యక్షత వహించారు. జస్టిస్ జి. రాధారాణి మాట్లాడుతూ.. సహజ వనరులు, డాలర్లపై ప్రజలదే పెత్తనమని, ప్రైవేటు, అగ్రరాజ్యాలకు పెత్తనం లేదన్నారు. ప్రపంచ శాంతికి దేశాల మధ్య సహకారం అత్యవసరమని, ప్రపంచీకరణ నేపథ్యంలో ఒకరి సహకారం లేకుండా ఏ దేశం ఒంటరిగా మనుగడ సాగించలేదన్నారు. 

పరస్పర జ్ఞాన మార్పిడి, వనరుల భాగస్వామ్యం ద్వారానే ప్రపంచం అభివృద్ధి పథంలో ముందుకెళ్లగలదని సూచించారు. వివిధ దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలు, రాజకీయ అస్థిరతపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కఫ్ నేషనల్ ప్రీసిడియం మెంబర్, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, ఆర్టీఏ మాజీ జాయింట్ కమిషనర్ సీఎల్ఎన్ గాంధీ, ఇస్కఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. గోపాల్, ప్రధాన కార్యదర్శి అరుణ్ రాజశేఖర్, న్యాయవాది బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.