- రాష్ట్రవ్యాప్తంగా1500 మంది విమెన్ ఆఫీసర్లు
- అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్విధుల్లోనూ కీలకం
- అటవీశాఖ మంత్రిగా సురేఖ, పీసీసీఎఫ్‌గా సువర్ణ
- అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సునీత భగవతి, సీసీఎఫ్లుగా ప్రియాంక వర్గీస్, ఎస్‌జే ఆశ, క్షితిజ, శివాని విధులు
హైదరాబాద్, వెలుగు: అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో మహిళా అధికారులు దూసుకెళ్తున్నారు. ఇటు ఇల్లూ, సంసారం, అటు ఉద్యోగం రెండింటినీ సమన్వయం చేస్తూ అటవీశాఖ ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. రాష్ట్రంలో బీట్ ఆఫీసర్ మొదలుకొని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) వరకు మహిళా ఆఫీసర్లు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అడవిలో ఉద్యోగం అంటే అంత ఆషామాషీ కాదు.
వన్యప్రాణులను కాపాడటంతోపాటు వేటగాళ్లను దీటుగా ఎదుర్కోవాలి. ఆక్రమణదారుల నుంచి అటవీ భూములను కాపాడాలి. స్మగ్లర్ల నుంచి ఎదురయ్యే సవాళ్లను తిప్పికొట్టాలి. అగ్ని ప్రమాదాల నుంచి అటవీ సంపదను కాపాడాలి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు. ఎటువైపు నుంచి అడవి జంతవులు వచ్చి దాడి చేస్తాయోనని టెన్షన్. నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలి. రాత్రీ, పగలు తేడా లేకుండా 24 గంటలూ విధి నిర్వహణకు రెడీగా ఉండాలి. ఇలాంటి ఉద్యోగాల్లో పురుషులకు దీటుగా అతివలు తమదైన ముద్ర వేస్తున్నారు.
4 వేల మందిలో 1500 మంది వారే..
పీసీసీఎఫ్ మొదలుకొని క్షేత్రస్థాయి ఎఫ్ఆర్వో, బీట్ ఆఫీసర్ల వరకు మహిళా అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. అటవీ దళాల అధిపతి (పీసీసీఎఫ్)గా డాక్టర్ సి. సువర్ణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్, జూ పార్కులు, శిక్షణ కేంద్రాలు, సమస్యాత్మక అటవీ రేంజ్‌లలోనూ మహిళలు ధైర్యంగా డ్యూటీలు చేస్తున్నారు. మొత్తం 83 మంది మహిళా అధికారులు ఉండగా.. వీరిలో అత్యధికులు క్షేత్రస్థాయిలో కీలకంగా ఉండే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు (ఎఫ్ఆర్వో) కావడం విశేషం.
పీసీసీఎఫ్, ఏపీసీసీఎఫ్ తోపాటు సీసీఎఫ్ ఐదుగురు, డిప్యూటీ కన్జర్వేటర్లు (డీసీఎఫ్) 12 మంది, ఏసీఎఫ్‌లు 10 మంది, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు (ఎఫ్ఆర్వోలు) 54 మంది మహిళా అధికారులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,547 మంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు (ఎఫ్‌బీఓ) ఉంటే.. అందులో వెయ్యికి పైగా మహిళలే కావడం విశేషం. మొత్తం అటవీశాఖలో 4 వేలపైగా ఉద్యోగులు ఉండగా.. అందులో మహిళా ఉద్యోగులు 1,500 మంది వరకు ఉన్నారు.
కీలక బాధ్యతల్లోనూ వారే..
రాష్ట్ర అటవీ దళాల అధిపతిగా డాక్టర్ సి.సువర్ణ అత్యున్నత బాధ్యతల్లో ఉండగా.. అడ్మినిస్ట్రేషన్ వింగ్‌లో అడిషనల్ పీసీసీఎఫ్ సునీత ఎం.భగవత్ కొనసాగుతున్నారు. చీఫ్ కన్జర్వేటర్లు (సీసీఎఫ్)గా ఐదుwగురు మహిళలు కీలక పోస్టుల్లో ఉన్నారు.
స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా సోనిబాలా దేవి, చార్మినార్ సర్కిల్ పీసీసీఎఫ్‌గా ప్రియాంక వర్గీస్, ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ డీన్‌గా ఎస్‌జే ఆశ, ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా క్షితిజ, శివాని డోగ్రా (ఎఫ్ఎస్ఐ, డెహ్రాడూన్), హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్‌గా వీవీఎల్ సుభద్రదేవి, జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగానికి, యాదాద్రి, హన్మకొండ జిల్లాల డీఎఫ్ఓలుగా మహిళా అధికారులే సారథ్యం వహిస్తున్నారు. మొత్తం 12 మంది డీసీఎఫ్ హోదా కలిగినవారు, 10 మంది ఏసీఎఫ్‌లు వివిధ బాధ్యతల్లో ఉన్నారు.
54 మంది ఎఫ్ఆర్వోలు..
అటవీ రక్షణలో అత్యంత కీలకమైనది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్వో) పోస్టు. అడవిలో స్మగ్లర్లను అడ్డుకోవడం, సరిహద్దు వివాదాలు పరిష్కరించడం, వన్యప్రాణుల వేటను అరికట్టడం వీరి బాధ్యత. ఈ కఠినమైన విధుల్లో రాష్ట్రవ్యాప్తంగా 54 మంది మహిళా ఎఫ్ఆర్వోలు పనిచేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, నిర్మల్‌లాంటి దట్టమైన అటవీ ప్రాంతాల్లోని రేంజ్‌లకు మహిళలే ఆఫీసర్లుగా ఉన్నారు.
కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా అటవీ నేరాలను అరికట్టే స్ట్రైకింగ్ ఫోర్స్, మొబైల్ పార్టీల్లోనూ మహిళలు డ్యూటీ చేస్తున్నారు. అడవిని కాపాడటం, పచ్చదనాన్ని పెంపొందించడం, వన్యప్రాణుల సంరక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారు. అంతేకాదు, రాష్ట్రంలో అటవీశాఖ మంత్రి కూడా మహిళే కావడం విశేషం. అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో మంత్రి కొండా సురేఖ స్పెషల్ ఫోకస్ పెట్టి అటవీశాఖకు వన్నె తెస్తున్నారు.
ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్నరు..
అటవీశాఖలో క్షేత్రస్థాయిలో అతివలు ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి భయం లేకుండా అడవుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తూ, స్మగ్లర్లను, వేటగాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. అటవీ ప్రాంతాల్లో కిలోమీటర్ల దూరం నడుస్తూ, స్మగ్లర్ల నుంచి కలపను కాపాడుతున్నారు. వన్యప్రాణుల వేటను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
డ్రోన్ కెమెరాల వినియోగం, జీపీఎస్ ట్రాకింగ్‌లాంటి ఆధునిక పద్ధతులను నేర్చుకుని అడవుల పర్యవేక్షణలో మహిళా సిబ్బంది ముందుంటున్నారు. ప్రస్తుతం అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మహిళలే అధికంగా ఉన్నారు. అటవీ గ్రామాల ప్రజలకు, గిరిజనులకు అడవి ఆవశ్యకతను వివరించడం, వారిని సంరక్షణలో భాగస్వామ్యం చేయడంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు.- సువర్ణ, పీసీసీఎఫ్
