IND vs NZ: వన్డే సిరీస్ నుంచి సుందర్ ఔట్.. నితీష్‌కు లైన్ క్లియర్.. రీప్లేస్ మెంట్‌గా అతడికే ఛాన్స్

IND vs NZ: వన్డే సిరీస్ నుంచి సుందర్ ఔట్.. నితీష్‌కు లైన్ క్లియర్.. రీప్లేస్ మెంట్‌గా అతడికే ఛాన్స్

న్యూజిలాండ్ తో జరగబోయే చివరి రెండు టీ20 మ్యాచ్ లకు టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడు. తొలి వన్డే ఆడుతూ గాయపడిన ఈ తమిళనాడు ఆల్ రౌండర్ రెండు, వన్డేలకు అందుబాటులో ఉండడం లేదు. ఆదివారం (జనవరి 11) వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో సుందర్ బౌలింగ్ చేస్తూ అసౌకర్యానికి గురయ్యాడు. 5 ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు ఇచ్చి మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 8వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. మ్యాచ్ తర్వాత సుందర్ కు ఎడమ పక్కటెముకలు గాయం అయినట్టు తేలింది. 

"వాషింగ్టన్ కు పక్కటెముక ప్రాంతంలో అసౌకర్యం ఉన్న కారణంగా అతను వన్డే సిరీస్ కు దూరమయ్యాడు". అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపినట్టు సమాచారం. సుందర్ కు సైడ్ స్ట్రెయిన్ ఉందని మ్యాచ్ తర్వాత స్కాన్ కోసం వెళ్తాడని మ్యాచ్ తర్వాత కెప్టెన్ గిల్ తెలిపాడు. ఈ టూర్ లో టీమిండియా ప్లేయర్లకు గాయాల బెడద కొనసాగుతూనే ఉంది. తొలి వన్డేకు ముందు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడి సిరీస్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. అంతకముందు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గజ్జల్లో గాయం కారణంగా కివీస్ తో జరగబోయే తొలి మూడు టీ20లకు దూరమయ్యాడు. 

సుందర్ దూరం కావడంతో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్ 11లో చోటు దక్కడం ఖాయంగా మారింది. ఇదిలా ఉంటే సుందర్ కు ఇంకా రీప్లేస్ మెంట్ ప్రకటించలేదు. ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్ కు వన్డేల్లో ఛాన్స్ దక్కొచ్చు. స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఉన్నప్పటికీ టీ20 వరల్డ్ కప్ ఉండడంతో పని భారం కారణంగా వన్డేలకు ఎంపిక చేసే అవకాశాలు కనిపించడం లేదు. 

తొలి వన్డేలో టీమిండియాదే విజయం:

న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. ఆదివారం (జనవరి 11) వడోదర వేదికగా ముగిసిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బౌలర్లు అంచనాలకు తగ్గట్టు రాణించకపోయినా బ్యాటర్లు దుమ్ములేపి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఛేజింగ్ లో విరాట్ కోహ్లీ (93) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడంతో పాటు కెప్టెన్ గిల్ (56) హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఇండియా 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసి గెలిచింది.