మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ . రాష్ట్రంలో 70 శాతం సర్పంచులు కాంగ్రెస్ గెలిచిందన్నారు. నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ .. సర్పంచ్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు.. నిజమాబాద్ కార్పొరేషన్ ను కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీయే లేదన్నారు. ఏడేళ్లుగా ఎంపీ అర్వింద్ జిల్లాకు ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నిజమాబాద్ ను ఇందూరుగా మారిస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయా? అర్వింద్ చెప్పాలి..? ఓటర్ లిస్టుల్లో తప్పులకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం, ప్రయత్నం కొనసాగుతాయని తెలిపారు.
శ్రీరాముని పెరు చెప్పి బీజేపీ ఎలా ఓట్లు అడుగుతుందో ప్రజలకు వివరించాలన్నారు మహేశ్ కుమార్ గౌడ్. శ్రీరాముడు బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడా? శ్రీరాముని పేరు చెప్పే హక్కు బీజేపీకి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. దేవుళ్ళ పేరుతో గెలిచిన బీజేపీ దేశ ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. నిజామాబాద్ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. నిజామాబాద్ నగరాన్ని స్పోర్ట్స్ హబ్ గా మారుస్తామని తెలిపారు. దేవాదాయ శాఖ ద్వారా జిల్లాలోని ఆలయాలు అభివృద్ధి చేస్తామన్నారు. ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబాద్రి గుట్ట,బాసరలను కలుపుతూ టెంపుల్ కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి విజనరీ లీడర్ అని .. దావోస్ పర్యటనతో 5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారని తెలిపారు మహేశ్ కుమార్ గౌడ్. రాష్ట్రాభివృద్ధికి రేవంత్ ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ ప్రపంచంలోనే గొప్ప నగరంగా మారబోతుందన్నారు. ఉచిత బస్సు పథకం దేశానికే రోల్ మోడల్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సన్న బియ్యం ఇవ్వటం లేదన్నారు. నిజమాబాద్ జిల్లాలో గత ప్రభుత్వ పెద్దలు బియ్యం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పెట్రోల్ సహా ఇతర నిత్యావసరాల ధరల నియంత్రణలో కేంద్రం విఫలమైందన్నారు. బీఆర్ఎస్ శకం ముగిసిందని.. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదన్నారు. కేసీఆర్ 7లక్షల కోట్ల అప్పు చేసి కష్టాల్లో నెట్టారని చెప్పారు.
