రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం.. ఈ వాక్యం పాఠశాల స్థాయిలోనే చరిత్ర పుస్తకాలలో చదివే ఉంటాం. సుమారు 200 సంవత్సరాలు భారత్ ను పాలించిన బ్రిటిష్ .. ఎన్ని ఆకృత్యాలు చేసిందో.. ఎంత దోపిడీ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వాతంత్ర్య పోరాటంలో ఎంత మంది అమరులయ్యారో.. ఎందరిని ఉరి తీశారో చరిత్ర సాక్ష్యాలు ప్రతి భారతీయుడి కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. అలాంటి నిరంకుశ సామ్రాజ్య ఏర్పాటుకు ముందుగా బాటలు వేసిందీ.. బ్రిటిష్ దురాక్రమణకు మార్గం సుగమం చేసిన కంపెనీనే ఈస్ట్ ఇండియా కంపెనీ.
బ్రిటిష్ ఇండియాను హస్తగతం చేసుకోక ముందే ఈ కంపెనీ కూడా ఎన్నో దురాగతాలకు పాల్పడింది. భారత సహజ వనరులు, సంపదను దోచుకుని ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా అప్పట్లో చక్రం తిప్పింది. అలాంటి కంపెనీ.. ప్రస్తుతం దివాళా తీసింది. దాదాపుగా మూతపడిపోయింది. అప్పటికే ఒకసారి దివాళా తీస్తే.. బ్రిటిష్-ఇండియన్ బిజినెస్ మెన్ 2010లో హస్తగతం చేసుకుని ఇవాళ్టి వరకు నడిపిస్తూ వచ్చారు.
భారత్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ముగిసింది. 1858లో బ్రిటిష్ సింహాసనం ఆధీనంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ రాజ్యం పాలన మొదలైంది. ఇండియాతో పాటు ఆసియా ఖండంలో సాగించిన దురాగతాల కారణంగా ఈస్ట్ ఇండియా కంపెనీ లెగసీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి నుంచి వ్యతిరేక భావనతోనే చూస్తుంటారు. ప్రపంచ వాణిజ్య విధానాన్ని ఈ కంపెనీ మార్చినప్పటికీ.. ఇండియాలో చేసిన హింసాకాండ కారణంగా ఎంతో మందిని బలిగన్నది ఈ కంపెనీ.
ప్రతీకారం తీర్చుకున్న ఇండియన్:
ఇండియన్ ఆంత్రప్రెన్యూవర్ సంజీవ్ మెహతా కంపెనీ పేరున ఉన్న హక్కులను 2010లో కొన్న సందర్భంగా అది వలస పాలకులపై ప్రతీకారం తీర్చుకోవడం అన్నట్లుగా ఇండియన్స్ చూశారు. ఇండియాను ఏలిన కంపెనీని ఏలుతున్న భారతీయుడు అంటూ అప్పట్లో సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ కంపెనీ మోడ్రన్ వర్షన్ అప్పుల్లో కూరుకుపోయింది.
2025 అక్టోబర్ లో లిక్విడేషన్ కు వెళ్లింది ఈ కంపెనీ. అంటే ఆస్తులు అమ్మి అప్పులు కట్టే ప్లాన్. పేరెంట్ కంపెనీ అయిన బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ కు రూ 6.3 కోట్ల బాకీ, 2.03 కోట్ల పన్నులు, 1.71 కోట్లు ఉద్యోగులకు బాకీ పడి ఉంది. దీంతో లిక్విడేషన్ కు వెళ్లిన ఓనర్ సంజీవ్ మెహతా.. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరున ఉన్న ఇతర ఆస్తులను కూడా క్లోజ్ చేశారు. కంపెనీ వెబ్ సైట్ డౌన్ అయ్యింది. లండన్ మేఫెయిర్ లోని 97 న్యూ బాండ్ స్ట్రీట్ లో ఉన్న ఆఫీసులో ఎంప్లాయిస్ కూడా లేరని స్థానిక మీడియా కథనంలో వెల్లడించింది.
కంపెనీకి పునరుజ్జీవం పోసిన సంజీవ్ మెహతా..
సంజీవ్ మెహతా.. ఈస్ట్ ఇండియా కంపెనీని కొనేందుకు 2000 సంవత్సరం నుంచి ప్లాన్ మొదలుపెట్టాడు. కంపెనీ హోల్ సేల్ బిజినెస్ స్టార్ట్ చేసేందుకు షేర్ హోల్డర్ల నుంచి అన్ని హక్కులు పొంది.. 2010 లో మేఫెయిర్ (Mayfair) లో 2 వేల స్క్వేర్ ఫీట్ లో లగ్జరీ స్టోర్ ను ప్రారంభించారు. హై ఎండ్ టీ, చాకోలేట్స్, స్వీట్స్, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువులను విక్రయిస్తూ బ్రాండ్ ను కొనసాగించారు.
కంపెనీనీ టేక్ ఓవర్ చేసిన తర్వాత వలసవాద చిహ్నాన్ని సానుకూలంగా మార్చే భావనగా అప్పట్లో మెహతా అభివర్ణించారు. 2017లో ది గార్డియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో .. ఒక భారతీయుడు ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీని కలిగి ఓన్ చేసుకున్నాడంటే.. ప్రతికూలత సానుకూలంగా మార్చుకున్నట్లే కదా.. చరిత్రలో ఈస్ట్ ఇండియా కంపెనీ దౌర్జన్య పద్ధతిలో తనను తాను నిర్మించుకుంటే, నేటి ఈస్ట్ ఇండియా కంపెనీ కరుణతో ముందుకు వెళ్తుందంటూ వ్యాఖ్యానించారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఒక కాలనీలో ఒక స్టోర్ కాదు. అప్పట్లో బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వానికి రెండు రెట్లు సైనికులు కలిగిఉన్న అతిపెద్ద సంస్థ. 1800ల ప్రారంభంలో కంపెనీ దాదాపు 2 లక్షల 50 వేల మంది ప్రైవేట్ సైన్యాన్ని కలిగి ఉండేది. ఇది అప్పటి బ్రిటిష్ సైన్యం కంటే రెండింతలు పెద్దది. దాదాపు ఇండియాలో ఎక్కువ శాతం ప్రాంతాన్ని ఆధీనంలోకి తెచ్చుకుని సుగంధ ద్రవ్యాలు, పత్తి, పట్టు, టీ, నీలిమందు మొదలైన వాణిజ్యాన్ని నడిపించింది.
అయితే 2010లో ఒక ఇండియన్ ఈ కంపెనీని హస్తగతం చేసుకోవడం భారతీయులకు గర్వకారణమే అయినప్పటికీ.. ప్రస్తుతం మూత పడటం బాధాకరమైన విషయం. ఎందుకంటే మూతపడుతుందంటే సంబరపడటానికి ఇది ఒకప్పటి వలసవాద కంపెనీ కాదు. భారతీయుడు చేజిక్కించుకుని నడిపిస్తూ వచ్చిన కొంపెనీ. వ్యాపారంలో నష్టం, ఆర్థిక సమస్యలతో ప్రస్తుతం మూత పడటం గమనార్హం.
