ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రభుత్వ పెద్దలపై అసత్య ఆరోపణలు సరికాదు: మంత్రి శ్రీధర్ బాబు

ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రభుత్వ పెద్దలపై అసత్య ఆరోపణలు సరికాదు: మంత్రి శ్రీధర్ బాబు

సోమవారం ( జనవరి 12 ) పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ ఆఫీసర్లపై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను తీవ్రంగా ఖండించారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదని అన్నారు.బాధ్యతాయుతమైన ఐఏఎస్ లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మంత్రులు ఆఫీసర్ల మీద అభియోగాలు సరికాదని అన్నారు.

ఇటీవల ఇదే అంశంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి ఐఏఎస్ లపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.ఓ మహిళా ఐఏఎస్‎పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని.. మహిళా ఆఫీసర్లను ఇబ్బందులు పెడుతూ ఏం సాధిస్తారని ప్రశ్నించారు. నాపై ఏమైనా రాయాలనుకుంటే రాయండి తట్టుకుంటా కానీ మహిళా అధికారులపై ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయొద్దని హెచ్చరించారు. 

రేటింగ్‌లు, వ్యూస్‌ కోసం అవాస్తవాలు వండి వార్చడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందని.. అడ్డగోలు రాతలు మంచికాదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నా కొడుకు చనిపోయినప్పుడే సగం చనిపోయానని.. తప్పుడు ఆరోపణలతో తనను ఇంకా మానసికంగా హింస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను వేధించడం ఇంకా సరిపోదు అనుకుంటే ఒకేసారి నాకింత విషమిచ్చి చంపేయండని హాట్ కామెంట్ చేశారు.