హైదరాబాద్ నగరవ్యాప్తంగా చైనీస్ మాంజాపై స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. గత నాలుగు రోజుల్లోనే ( జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు) రూ. 43 లక్షల విలువైన 2,150 బాబిన్లను హైదరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. పర్యావరణానికి, పక్షులకు, మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ నిషేధిత మాంజాను విక్రయిస్తున్న వ్యవహారంలో 29 కేసులు నమోదు చేసి.. 57 మందిని అరెస్ట్ చేశారు.
ఇక గత నెల రోజుల్లో నమోదైన 132 కేసుల్లో రూ.1.68 కోట్ల విలువైన 8,376 బాబిన్లను స్వాధీనం చేసుకొని, మొత్తంగా 200 మందిని అరెస్ట్ చేశారు. నిషేధిత మాంజాను విక్రయించినా కొనుగోలు చేసినా జైలు శిక్ష తప్పదు. కాబట్టి సురక్షితమైన దారాలనే వాడుతూ, ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు
నిబంధనలను ఉల్లంఘించి చైనా మాంజాను వాడినా, అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. జిల్లాల్లో ఎక్కడైనా చైనా మాంజా విక్రయిస్తుంటే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
