బషీర్‌బాగ్/వికారాబాద్, వెలుగు: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. వడ్డె ఓబన్న 219వ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతి, బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్, వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. రవీంద్రభారతిలో తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ.. నల్లమల అడవులను కేంద్రంగా చేసుకుని గెరిల్లా యుద్ధ తంత్రాలతో బ్రిటిష్ సైన్యాన్ని వడ్డె ఓబన్న గడగడలాడించారన్నారు.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్‌పై ఓబన్న విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. వికారాబాద్‌లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి మాధవరెడ్డి మాట్లాడుతూ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలోని సాయుధ పోరాటంలో ఓబన్న కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేషన్ చైర్మన్లు, సంఘాల నాయకులు, అధికారులు పాల్గొని వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
