- సంక్రాంతి నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో కోళ్ల పందేల నిర్వహణ
- మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉండేలా పందెంరాయుళ్ల ప్లాన్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సంక్రాంతి నేపథ్యంలో కోళ్ల పందేలరాయుళ్లతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని లాడ్జీలకు గిరాకీ పెరిగింది. కోళ్ల పందేల నేపథ్యంలో మూడు రోజుల నుంచి ఐదు రోజుల పాటు ఇక్కడే మకాం వేసేందుకు ప్లాన్ చేసిన పందెంరాయుళ్లు.. మూడు వారాల కిందటే గదులను బుక్ చేసుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాలైన తిరువూరు, వేలేరు, జీనుగులమిల్లి, కామయ్యపాలెం, వేలేరుపాడు, కుక్కునూరు, శ్రీనివాసపురం, అంకంపాలెం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోళ్ల పందేలు నిర్వహిస్తుంటారు.
మూడు నుంచి ఐదు రోజుల పాటు సాగే ఈ పందేలలో రూ. కోట్లలో లావాదేవీలు జరుగుతాయి. ఈ పందేల కోసం హైదరాబాద్‌తో పాటు ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యాపారస్తులు, ప్రజలు వస్తుంటారు. దీంతో పందేలు జరిగినన్ని రోజులు ఇక్కడే ఉండేలా అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి, వీఎం బంజర్ ప్రాంతాల్లోని లాడ్జీలను ముందే బుక్ చేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఒక్క గది కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. డిమాండ్ పెరగడంతో లాడ్జీల నిర్వాహకులు సైతం రేట్లను పెంచేశారు. మరో వైపు సరిహద్దు ప్రాంతాల్లో మద్యం, మాంసం అమ్మకాలు చేపట్టేందుకు వ్యాపారులు సన్నాహాలు చేసుకుంటున్నారు.
