డీఏ, పీఆర్సీ బకాయిలను క్లియర్ చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డికి పీఎస్ హెచ్ఎంఏ వినతి

డీఏ, పీఆర్సీ బకాయిలను క్లియర్ చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డికి పీఎస్ హెచ్ఎంఏ వినతి

హైదరాబాద్, వెలుగు: ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ బకాయిలతో పాటు పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని ప్రైమరీ స్కూల్స్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ (పీఎస్ హెచ్ఎంఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రచ్చ మురళి.. ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హైదరాబాద్ లోని సీఎం క్యాంపు ఆఫీసులో  ప్రైమరీ స్కూళ్లు, ఇతర టీచర్ల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి ఆయన వినతిపత్రం అందించారు. 

ప్రభుత్వ బడుల నిర్వహణకు గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించాలని ఆయన సీఎంను కోరారు. విద్యా ప్రమాణాలు పెరగాలంటే తరగతికి ఒక టీచర్​ను కచ్చితంగా నియమించాలని, స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైమరీ స్కూళ్ల పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. 

దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. బిల్లులు క్లియర్ చేస్తానని సీఎం హామీనిచ్చినట్టు రచ్చ మురళి తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తామని, డీఏ, పీఆర్సీ తొందరగా పరిష్కరిస్తామని సీఎం భరోసా ఇచ్చారని వెల్లడించారు. సమస్యల పరిష్కారంపై హామీ ఇచ్చినందుకు సీఎంకు రచ్చ మురళి కృతజ్ఞతలు తెలిపారు.