- ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి
హైదరాబాద్, వెలుగు: దేశంలో మహిళల హక్కులను కాలరాస్తున్న పాలకులు.. చివరికి ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమైన ఓటుహక్కును కూడా తొలగిస్తున్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ కోశాధికారి ఎస్. పుణ్యవతి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్‌లో సర్వే పేరుతో 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తే.. అందులో 65 శాతం మంది మహిళలే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నెల 25 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఐద్వా 14వ అఖిల భారత మహాసభల సందర్భంగా రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. మహిళల హక్కుల రక్షణ కోసం మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి , రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశలత, ఎం. స్వర్ణలత, లీలావతి, పద్మశ్రీ, రాజకుమారి పాల్గొన్నారు.
