మెదక్(చేగుంట), వెలుగు: జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి 11 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. రంగారెడ్డి జిల్లా బోయిన్పల్లిలోని స్కై ఫుట్బాల్ అకాడమీలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి అండర్–15 బాలబాలికల పోటీల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. బాలికల విభాగంలో మెదక్ జిల్లా టీం రెండో స్థానంలో నిలిచి వెండి పతకం సాధించింది.
బాలుర విభాగంలో మూడోస్థానం దక్కగా క్రీడాకారులు కాంస్య పతకం గెలుచుకున్నారు. బాలికల విభాగంలో ప్రతిభ కనబరిచిన హరిణి సింగ్, కీర్తన, నందిని, అర్చన, వర్షశ్రీ, లావణ్య, రక్షిత, బాలుర విభాగం నుంచి విష్ణు, కెవిన్, రఘునందన్, వేణుగోపాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
బాలికల జాతీయ స్థాయి పోటీలు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ లోని కళింగ యూనివర్సిటీలో జరగనుండగా.. బాలుర పోటీలు 19 నుంచి 21వ తేదీ వరకు అక్కడే జరుగుతాయని కోచ్ గణేశ్తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన వారిని మెదక్ జిల్లా రగ్బీ కోచ్ లు నవీన్, మహేశ్అభినందించారు.
