భారతీయ వెబ్ సిరీస్ చరిత్రలో రికార్డు సృష్టించిన 'సాక్రెడ్ గేమ్స్' ద్వారా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్న నటి ఎల్నాజ్ నొరోజీ. ఇరాన్ దేశానికి చెందిన ఈ బ్యూటీ పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా మారుమోగుతోంది. తన మాతృభూమిలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం , ఇరాన్- పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇరాన్ ప్రభుత్వంపై నిప్పులు
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇరాన్ పాలకుల తీరుపై ఎల్నాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రజల ఆలోచనలు వేరని, పాలకుల నిర్ణయాలు వేరని ఆమె స్పష్టం చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ అనేది ఇరాన్‌ను ఆక్రమించుకున్న ఒక వ్యవస్థ మాత్రమే. ఇక్కడి ప్రజలు విద్యావంతులు, తెలివైనవారు. మా పూర్వీకులు యూదులకు స్వేచ్ఛను ప్రసాదించిన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇజ్రాయెల్, అమెరికాతో మాకు మంచి సంబంధాలు ఉండేవి. కానీ, ప్రస్తుత పాలకులు ఇజ్రాయెల్‌ను మ్యాప్ నుంచి తుడిచేస్తామని మాట్లాడుతున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వెళ్తే నన్ను చంపేస్తారు..
ఎల్నాజ్ మాటల్లోని ఆవేదన వెనుక ఒక చేదు నిజం ఉంది. 2022లో మహసా అమిని మరణం తర్వాత జరిగిన ఆందోళనల్లో ఎల్నాజ్ నొరోజీ చురుగ్గా పాల్గొన్నారు. హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా గొంతు ఎత్తారు. ఆ సమయంలో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పుడు ఆమె సొంత దేశంలో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. నేను ఇరాన్‌లో అడుగుపెడితే వారు నన్ను చంపేస్తారనే భయం ఉంది. అందుకే గత పదేళ్లుగా నేను నా దేశానికి వెళ్లలేదు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న నియంతృత్వమే ఈ యుద్ధానికి, రక్తపాతానికి కారణం అని నొరోజీ స్పష్టం చేశారు.
ఇరాన్ టు ఇండియా
8 ఏళ్ల వయసులో ఇరాన్ నుండి జర్మనీకి వలస వెళ్ళిన ఎల్నాజ్, తన 20వ ఏట మోడలింగ్, నటనపై మక్కువతో భారత్‌కు వచ్చారు. 'సాక్రెడ్ గేమ్స్'లో 'జోయా' పాత్రతో ఆమె నటనకు మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, సామాజిక అంశాలపై కూడా ధైర్యంగా స్పందించే నటిగా ఆమె పేరు తెచ్చుకుంటున్నారు.
