ఊరంతా హోలీ పండుగ వేడుకల్లో నిమగ్నమై ఉన్న వేళలో.. మంచిర్యాల జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. రెండు ఇండ్లు తగలబడటంతో తీవ్ర నష్టం కలిగింది. మంగళవారం (మార్చి 03) కోటపల్లి మండలం అన్నారం గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా జనాలను భయాందోళనకు గురిచేసింది.
గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో దూరికే పోచన్న, ఎలాజి సమ్మయ్య కు చెందిన ఇండ్లు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. ఇళ్లలోని గృహోపకరణాలతో పాటు సుమారు లక్ష నగదు, అరకిలో వెండి చెవి కమ్మలు పూర్తిగా కాలిపోయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అదే విధంగా ఆహార పదర్థాలు, బట్టలు మంటల్లో బూడిదైపోయాయి.
ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంటలు భారీగా ఎగసిపడటంతో.. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకుని ఊరంతా వ్యాపించాయి. దీంతో స్థానికులు సంపు మోటార్ల సాయంతో మంటలు ఆర్పినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇండ్లు కాలిపోవడంతో కుటుంబాలు రోడ్డున పడ్డట్లు అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తక్షణ సహాయం అందించాలని బాధితులు కోరుతున్నారు.
