ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హతమార్చడం వెనుక ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ అల్లిన వ్యూహం ఏ హాలీవుడ్ స్పై థ్రిల్లర్‌కూ తీసిపోదు. ఇది ఒక్క రోజులో జరిగిన మెరుపు దాడి కాదు.. ఏళ్ల తరబడి ఇరాన్ గుండెల్లోకి నిశ్శబ్దంగా చొచ్చుకుపోయిన టెక్నాలజీ యుద్ధం అని తేలింది. గూఢచర్య చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ వివరాలు ఇప్పుడు ప్రపంచాన్ని విస్తుపోయేలా చేస్తున్నాయి.
ట్రాఫిక్ కెమెరాలే గూఢచారులుగా..
ఇజ్రాయెల్ గూఢచారులు టెహ్రాన్ నగరంలోని ట్రాఫిక్ కెమెరా వ్యవస్థను రహస్యంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టెహ్రాన్ వీధుల్లోని వేలాది నిఘా కెమెరాలు ఇరాన్ అధికారులకు సమాచారం ఇస్తూనే, మరోవైపు టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ సర్వర్లకు లైవ్ ఫీడ్ పంపించాయి. ఈ కెమెరాల ద్వారా ఖమేనీ నివసించే 'పాశ్చర్ స్ట్రీట్' కాంపౌండ్‌లోకి ఎవరెవరు వస్తున్నారు.. ఏ వాహనాలు వెళ్తున్నాయి.. భద్రతా సిబ్బంది వాహనాలను ఎక్కడ పార్క్ చేస్తున్నారు లాంటి అంశాలను ఇజ్రాయెల్ నిరంతరం పర్యవేక్షించిందట.
గూస్ బంప్స్ తెప్పించే టెక్నాలజీ
కేవలం కెమెరాలే కాదు.. ఇరాన్‌లోని మొబైల్ నెట్‌వర్క్‌ను కూడా ఇజ్రాయెల్ హ్యాక్ చేసింది. ఖమేనీ ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఆయన దినచర్య ఎలా ఉంటుంది? అనే అంశాలపై కచ్చితమైన డిజిటల్ మ్యాపింగ్ తయారు చేసుకుంది ఇజ్రాయెల్ ఈ సమాచారంతో. 86 ఏళ్ల ఈ వృద్ధుడి ప్రతి కదలికను ఇజ్రాయెల్ విశ్లేషకులు ఒక గ్రాఫ్ లాగా మార్చేశారు. ఈ నిఘా ఎంత కచ్చితంగా ఉందంటే.. ఖమేనీ తన భద్రతా సిబ్బందితో కలిపి శనివారం ఉదయం ఏ భవనంలో ఉంటారో ముందే పసిగట్టారు.
రాత్రి వద్దు.. పగలే అటాక్
సాధారణంగా దాడులు రాత్రి వేళ జరుగుతాయి. కానీ ఇజ్రాయెల్, అమెరికా బలగాలు ఒక భయంకరమైన టాక్టికల్ సర్ప్రైజ్ ఇచ్చాయి. రాత్రి పూట దాడి చేస్తే శత్రువు అప్రమత్తంగా ఉంటాడని భావించిన ఇజ్రాయెల్.. శనివారం ఉదయం 6 గంటల సమయంలో మెరుపు దాడులతో ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ప్రెసిషన్ గైడెడ్ క్షిపణులతో ఒక్క నిమిషం వ్యవధిలో మూడు కీలక ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి. ఈ దెబ్బతో ఖమేనీతో పాటు రివల్యూషనరీ గార్డ్ కమాండర్ సహా మరో 40 మంది కీలక అధికారులు కలిసిన చోటనే మరణించారు.
పేజర్లు, వాకీటాకీల వెనుక మాయాజాలం
గతంలో హెజ్బొల్లా సభ్యుల పేజర్లు, వాకీటాకీలను పేల్చిన అనుభవం మొసాద్‌కు ఉంది. ఆ టెక్నాలజీనే ఇక్కడ మరింత అడ్వాన్స్‌డ్‌గా వాడారు. నిఘాకు దొరకకుండా ఉండేందుకు ఇరాన్ అధికారులు వాడే సాంకేతిక పరికరాలనే ఇజ్రాయెల్ వారికి 'డెత్ ట్రాప్స్'గా మార్చేసింది. హంగేరీ వంటి దేశాల్లో డొల్ల కంపెనీలను సృష్టించి.. ఇరాన్‌కు చేరే పరికరాల్లో ముందే చిన్నపాటి పేలుడు పదార్థాలను అమర్చి టెహ్రాన్ రక్షణ వ్యవస్థను కుప్పకూల్చింది.
