T20 World Cup: టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే సెమీస్ కు చేరుకున్న ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, భారత్ జట్లు రేపటి నుంచి ఈ కీలక పోరు స్టార్ట్ కానుంది. దీంతో టీమిండియా సెమీఫైనల్ కి చేరినప్పటికీ టైటిల్ కొట్టడం అంత ఈజీ కాదని క్రీడా విశ్లేషకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ఫామ్ కోల్పోవడం, బౌలింగ్ లో మొత్తం జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధారపడటం బలహీనంగా మారాయి. ఈ మెగా టోర్నీలో పేలవమైన ఫీల్డింగ్, క్యాచ్ డ్రాప్ లు, సగటు భారత క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇక భారత జట్టు బ్యాటింగ్ టాప్ ఆర్డర్ వరుసగా విఫలం అవుతుండటం వలన ప్రతి మ్యాచ్ లో ఎవరో ఒకరు వ్యక్తిగత ప్రదర్శన చేయడంపైనే పూర్తిగా ఆధారపడుతుంది. ఇంగ్లాండ్ తో జరిగే కీలక పోరులో సమష్టిగా కలిసి రాణించకపోతే కప్పు కొట్టడం అనేది కలగానే మిగిలిపోయో ప్రమాదం ఉంది.
భారత్– ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తర పోరు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. సెమీఫైనల్ కి టీమిండియాలో కీలక మార్పులు జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. సెమీస్ కోసం వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చి తుది జట్టులోకి మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉండటంతో మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే బౌలర్ అవసరమని జట్టు యజమాన్యం భావిస్తుంది. కుల్దీప్ తన చైనామన్ బౌలింగ్ తో మ్యాచ్ ని మలుపుతిప్పగల సత్తాని కలిగి ఉన్నాడు. భారత జట్టులో ఈ ఒక్క మార్పు మినహా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు అని ప్రచారం జరుగుతుంది.
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా రేపటి (మార్చి 4) నుంచి సెమీఫైనల్ మ్యాచ్ లు స్టార్ట్ కానున్నాయి. రేపు జరిగే మొదటి సెమీస్ లో దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ పోటీ పడనున్నాయి. మార్చి 5వ తేదీన జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. రెండో సెమీస్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది. ఈ నాకౌట్ మ్యాచ్ గెలిచి ఫైనల్ చేరాలని ఇరు జట్లు వేచి చూస్తున్నాయి. దీంతో ఏ జట్టు విజయం సాధించి ఫైనల్ ఫైట్ కి వెళ్తుందో చూడాలి.
