ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజరు పోలీస్ స్టేషన్‌లో ఒక నిరుద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో విస్తుగొలిపే స్కామ్ బయటపడింది. ఇక్కడ తీగ లాగితే అంతర్జాతీయ స్థాయిలో రూ.547 కోట్ల విలువైన సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. నిందితులు కుబేర సినిమా తరహాలో అమాయకులతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి, వాటి ద్వారా రూ.కోట్లలో ట్రాన్సాక్షన్స్ చేశారు. విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ, సైబర్ ఫ్రాడ్స్‌కు పాల్పడి రూ.వందల కోట్లు కొల్లగొట్టారు
ఉద్యోగాల పేరుతో నమ్మించి..
సత్తుపల్లి, కల్లూరు, వేంసూరు మండలాలకు చెందిన పోట్రు మనోజ్ కల్యాణ్, ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రియ, మేడ సతీశ్, మోరంపూడి చెన్నకేశవ అనే ఆరుగురు నిందితులు సత్తుపల్లి ఏరియాకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపారు. ఉద్యోగం ఇచ్చినట్టు నమ్మించి, వారి పేర్లతో హెచ్‌డీఎఫ్‌సీ, సౌత్ ఇండియన్ బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్స్ఓపెన్ చేయించారు. ఆ అకౌంట్లకు సంబంధించిన బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ ను తీసుకుని, అదే అకౌంట్‌లో సైబర్ క్రైమ్స్ ద్వారా సంపాదించిన రూ.కోట్లు జమ చేశారు. నిందితులు తమ ఏజెంట్ అయిన వేంసూరు మండలం లింగపాలెంకి చెందిన జొన్నలగడ్డ తిరుమల సాయి, సత్తుపల్లికి చెందిన బాడిస మురళి, మరికొందరి ద్వారా నిరుద్యోగ యువకులను, రైతులను గుర్తించి .. ట్రేడింగ్ చేసుకోవడానికి ఆదాయ పన్ను ఇబ్బందులు ఉన్నాయని తమకు అకౌంట్లు కావాల్సి ఉందని నమ్మించారు.
ఒక్కో సేవింగ్ అకౌంటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు, కరెంటు అకౌంట్‌కు రూ.10 వేల వరకు ఇచ్చి కొందరితో అకౌంట్లను ఓపెన్ చేయించుకున్నారు. అకౌంట్‌కు సంబంధించిన కిట్ రాగానే వారే తీసుకుని, సైబర్ నేరాలకు వాడుకునేవారని దర్యాప్తులో తేలింది. కొద్ది రోజుల కింద హైదరాబాద్‌లో ఓ వ్యక్తిని పెట్టుబడుల పేరుతో రూ.14 కోట్లు మోసం చేసిన కేసులో అరెస్టు చేసిన గనిపిశెట్టి నాగ బ్రహ్మనాయుడు, తాటికొండ పవన్ కల్యాణ్, దాసరి మునిరామ్, జవ్వాజి హరికృష్ణతో పాటు బాడిశ మురళి అతని భార్య నాగలక్ష్మి, చిటికుల సందీప్ తదితరులు వీరికి బ్యాంక్ అకౌంట్లు ఇచ్చి సహకరించినట్లు విచారణలో తెలిసింది.
స్కామ్ బయటపడిందిలా..
సత్తుపల్లి మండలం తుంబూరుకు చెందిన మోదుగు సాయికిరణ్ అనే యువకుడు గతేడాది డిసెంబర్ 24న తన ఖాతాలో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్టు వీఎం బంజరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. సాయికిరణ్‌తో 2022లో సైబర్ నేరగాళ్లు పోట్రు మనోజ్ కల్యాణ్, పోట్రు ప్రవీణ్, ఉడతనేని వికాస్ చౌదరి, మోరంపూడి చెన్నకేశవులు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించారు. వాటి ఆన్‌లైన్ వివరాలను సాయికిరణ్‌కు ఇవ్వకుండా నిందితులే తీసుకున్నారు. ఆ అకౌంట్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు అనుమానించిన సాయికిరణ్.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో 15 రోజుల కింద పోట్రు ప్రవీణ్‌ను వీఎం బంజర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని రెండుసార్లు పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించి, సైబర్ క్రైమ్ ముఠా వివరాలు సేకరించారు.
