- కళాకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- సమాజ సమస్యలపై కళల ద్వారా చైతన్యం తీసుకురావాలని వెల్లడి
- బషీర్‌బాగ్ ఎల్‌బీ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జయంత్యుత్సవాలు
- ఉత్సవాల్లో పాల్గొన్న రెండు వేల మందికి పైగా కళాకారులు
బషీర్‌బాగ్, వెలుగు: దేవాలయాలు, పర్యాటకం, సాంస్కృతిక రంగాల సమన్వయంతో రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధానాన్ని తీసుకొస్తే అకాడమీకి మరిన్ని నిధులిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం బషీర్‌బాగ్ ఎల్‌బీ ఇండోర్ స్టేడియంలో వాగ్గేయకారుడు భక్తరామదాసు 393వ జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. సంగీత దర్శకుడు సాలూరు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కళలు తెలంగాణ ఆత్మస్వరూపమని, ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక కళారూపం కనిపించడం రాష్ట్ర ప్రత్యేకత అన్నారు.
కళాకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమాజ సమస్యలపై కళల ద్వారా చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల మందికి పైగా కళాకారులతో ఈ ఉత్సవాలను నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు రెండు వేదికలపై సంగీత, నృత్య కార్యక్రమాలు సాగాయి.
అన్ని ప్రదర్శనలూ రామదాసు కీర్తనలతోనే నిర్వహించడం విశేషం. పద్మశ్రీ డాక్టర్ యెల్లా వెంకటేశ్వర రావు నేతృత్వంలో నిర్వహించిన నవ సంకీర్తన గానగోష్టి ఆకట్టుకుంది. మురళీకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఆర్. వినోద్ కుమార్ సమన్వయం చేశారు. కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు రాఘవాచారి, కళాకృష్ణ, హరిప్రియ, శేషులత, కమల, శ్వేతా ప్రసాద్, అయ్యగారి శ్రీదేవి, రోహిణి కందాల, మంథా శ్రీనివాస్, డాక్టర్ శ్రీకాంత్, ఆర్. నాగేశ్వరరావు పాల్గొన్నారు.
