- హెచ్ఆర్‌డీఏ అధ్యక్షుడు డాక్టర్ కార్తీక్
హైదరాబాద్, వెలుగు: రైతుల ప్రాణాలను బలి తీసుకుంటున్న ప్రమాదకరమైన పారాక్వాట్ గడ్డి మందును తక్షణమే బ్యాన్చేయాలని హెల్త్ కేర్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్(హెచ్ఆర్ డీఏ) అధ్యక్షుడు డాక్టర్ కార్తీక్ నాగుల రాష్ట్ర సర్కార్ను ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. మార్కెట్లో దొరుకుతున్న అత్యంత విషపూరితమైన హెర్బిసైడ్లలో పారాక్వాట్ ఒకటని, ఆత్మహత్యాయత్నానికి దీన్ని తాగే రైతులు, కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పారాక్వాట్ మందు కొంచెం కడుపులోకి వెళ్లినా.. శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతింటాయన్నారు. ఈ మందు విచ్చలవిడిగా దొరకడం వ్యవస్థ వైఫల్యమేనని పేర్కొన్నారు. పారాక్వాట్పై డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్స్ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం రైతుల భద్రత కోసం దీన్ని నిషేధించాలని విజ్ఞప్తి చేశారు.
