యువతకు ‘యువ ఆపద మిత్ర’ ట్రైనింగ్ : దాన కిశోర్

యువతకు ‘యువ ఆపద మిత్ర’ ట్రైనింగ్ :  దాన కిశోర్
  • 99 రోజుల ప్రణాళికలో రాష్ట్రవ్యాప్తంగా మాక్ డ్రిల్స్: దాన కిశోర్

హైదరాబాద్, వెలుగు: విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించి సహాయక చర్యలను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ‘యువ ఆపద మిత్ర’ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్‌‌మెంటల్ స్టడీస్(ఆర్‌‌సీయూఈఎస్), విపత్తు నిర్వహణ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధి నుంచి వచ్చిన 120 మంది ఎన్‌‌ఎస్‌‌ఎస్ వలంటీర్లతో మాట్లాడారు. విపత్తు సంభవించినప్పుడు సమయోచిత స్పందనే అత్యంత కీలకమన్నారు. 

విపత్తులను ధైర్యంగా ఎదుర్కొనేలా యువతకు అందుతున్న శిక్షణ తీరుపై ఆరా తీసి, నిర్వాహకులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంలో యువ వలంటీర్లు కీలక పాత్ర పోషించబోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని యువతకు దశలవారీగా శిక్షణ ఇస్తామని, అన్ని జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.