- సమాచార లోపం వల్లే గందరగోళం: మంత్రి శ్రీధర్ బాబు
- మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఫైర్
- పీఠం అభివృద్ధికి అండగా ఉంటామని వెల్లడి
- శారదా పీఠాన్ని సందర్శించిన మంత్రి
హైదరాబాద్, వెలుగు: కోకాపేటలోని శారదా పీఠం భూముల వ్యవహారంలో సమాచార లోపం వల్లే గందరగోళం తలెత్తిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆ భూములు శారదా పీఠానికే చెందుతాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. పీఠం అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఆదివారం కోకాపేటలోని శారదా పీఠాన్ని మంత్రి సందర్శించారు. అక్కడి రాజశ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాబు మీడియాతో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందని చెప్పారు. ‘‘మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. తప్పులు దొర్లితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.
అసలు విషయం తెలిసిన వెంటనే శారదా పీఠం భూముల విషయంలో జరిగిన పొరపాటును సరిదిద్దుకున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాం” అని మంత్రి పేర్కొన్నారు. మతాన్ని అడ్డు పెట్టుకొని కొందరు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమది బుల్డోజర్ సంస్కృతి కాదని, కబ్జాకోరుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడడం చూసి ఓర్వలేకే కొందరూ తమపై బురద జల్లుతున్నారని విమర్శించారు. బాపు ఘాట్ అభివృద్ధి విషయంలో ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామని, తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని స్థానికులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
