బడుల్లో నెట్ కష్టాలు... రాష్ట్రంలో 63 శాతం స్కూళ్లలో నే అందుబాటు

బడుల్లో నెట్ కష్టాలు... రాష్ట్రంలో 63 శాతం స్కూళ్లలో నే అందుబాటు
  •     ఇంటర్నెట్​ సౌకర్యంలో 23వ స్థానం
  •     స్పెషల్ ​నీడ్స్​ పిల్లల టాయిలెట్ల నిర్మాణంలో లాస్ట్ నుంచి రెండో స్థానం 
  •     యూడైస్ ​ప్లస్​2024–25 నివేదికలో బహిర్గతం  

హైదరాబాద్, వెలుగు: ఐటీ హబ్​గా చెప్పుకునే తెలంగాణలోని స్కూళ్లు ఇంటర్నెట్ కష్టాలను ఎదుర్కొంటున్నాయి. 37 శాతం బడులు ఇంటర్నెట్​కు దూరంగా ఉన్నాయి. ఇక ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం టాయిలెట్లు కట్టడంలోనూ గత ప్రభుత్వం విఫలమైంది. ఈ అంశంలో రాష్ట్రం దేశంలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. కేంద్ర విద్యాశాఖ యూడైస్ ప్లస్ 2024–25 డేటా ద్వారా ఈ విషయం బహిర్గతమైంది. 

మనకంటే మెరుగ్గా బిహార్​లో..

రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్, ప్రైవేట్ స్కూళ్లు సుమారు 41వేల వరకు ఉన్నాయి. కాగా వీటిలో కేవలం 63.3 శాతం స్కూళ్లలోనే ఇంటర్నెట్​ సౌకర్యం ఉంది. చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల కంటే వెనుకబడి తెలంగాణ 23వ స్థానంలో నిలిచింది. లక్ష్యద్వీప్, ఢిల్లీ, ఛత్తీస్ గఢ్​తోపాటు పలు రాష్ట్రాల్లో వందశాతం బడుల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ఏపీలో 99శాతం బడుల్లో ఉండగా, బిహార్​లాంటి రాష్ట్రంలోనూ 84.8 శాతం నెట్​సౌకర్యం ఉండి మనకంటే మెరుగైన స్థానంలో ఉంది. ఇక రాష్ట్రంలో 86 శాతం బడుల్లోనే కంప్యూటర్లు ఉన్నాయి. ఈ అంశంలో 14 స్థానంలో నిలిచాం. 

తాగునీరు అందించడంలో తెలంగాణ భేష్​

ప్రత్యేక అవసరాలుఉన్న పిల్లలకు (సీడబ్ల్యూఎస్​ఎన్) అనుకూలంగా ఉండే టాయిలెట్ల నిర్మాణంలో తెలంగాణ దేశంలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఐదు శాతంలోపు బడుల్లోనే స్పెషల్​నీడ్స్ పిల్లలకు టాయిలెట్స్​ సౌకర్యం ఉంది. స్కూళ్లలో బాయ్స్ టాయిలెట్లు 90 శాతం బడుల్లో, గర్ల్స్ టాయ్​లెట్స్ 95.7 శాతం బడుల్లో ఉన్నాయి. ఇక రాష్ట్రంలో 97 శాతం బడుల్లోనే ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఉందని యూడైస్ లెక్కలు చెబుతున్నాయి. 

పంజాబ్, హర్యానా, గుజరాత్, గోవా వంటి రాష్ట్రాలు ఎప్పుడో 100 శాతం విద్యుత్​సౌకర్యాన్ని అందిస్తున్నాయి. తాగునీరు అందించడంలో రాష్ట్రం మెరుగైన స్థానంలోనే ఉంది. మొత్తం 99.6 శాతం స్కూళ్లలో నీటి సౌకర్యం ఉంది. లైబ్రరీ సౌకర్యం 94.9 శాతం బడుల్లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.