సైనిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రపంచ నేతలు

సైనిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రపంచ నేతలు

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఆదివారం మృతిచెందారు. కాగా ఈ ఘటన సైనిక జోక్యం, లక్షిత దాడుల కారణంగా అధికారం కోల్పోయిన ప్రపంచ నాయకుల చరిత్రను గుర్తుచేస్తోంది..

గడాఫీ (లిబియా)

లిబియా అంతర్యుద్ధం చివరి దశలో ఉండగా 2011 అక్టోబర్ 20న గడాఫీని తన సొంత పట్టణమైన సిర్తే సమీపంలో దాడి చేసి చంపేశారు. తమ దేశాన్ని ఏకంగా 42 ఏళ్ల పాటు పాలించిన ఆయన, కాన్వాయ్‌‌‌‌లో తప్పించుకోవడానికి ప్రయత్నించగా నాటో వైమానిక దళం ఆ వాహనాలను ధ్వంసం చేశాయి. దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన గడాఫీ.. డ్రైనేజీ పైపులో దాక్కుని ఉండగా తిరుగుబాటు దారులకు చిక్కారు.

సద్దాం హుస్సేన్ (ఇరాక్)

2003లో ఇరాక్​పై అమెరికా ‘ఆపరేషన్ రెడ్ డాన్’ పేరిట దండయాత్ర చేపట్టింది. టిక్రిత్ సమీపంలోని ఒక ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో చిన్న భూగర్భ బిలంలో దాక్కుని ఉన్న ఆ దేశ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌‌‌‌ను డిసెంబర్​ 13న అదుపులోకి తీసుకున్నారు. 1982 నాటి దుజైల్ ఊచకోతకు శిక్షగా ఇరాకీ స్పెషల్ ట్రిబ్యునల్ ఆయనకు ఉరిశిక్ష విధించింది. డిసెంబర్ 30, 2006న బాగ్దాద్‌‌‌‌లో ఆయనను ఉరితీశారు.

అన్వర్ సాదత్ (ఈజిప్ట్)

ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్ సాదత్ 1981 అక్టోబర్ 6న కైరోలో జరిగిన విజయ్ పరేడ్ సందర్భంగా హత్యకు గురయ్యారు. ఈజిప్షియన్ లెఫ్టినెంట్ ఖలీద్ ఇస్లాంబౌలీ నేతృత్వంలోని సైనిక దళం గ్రెనేడ్లు, అసాల్ట్ రైఫిళ్లతో అధ్యక్షుడి స్టాండ్‌‌‌‌పై దాడి చేసింది. శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్‌‌‌‌ను అధికారికంగా గుర్తించిన మొదటి అరబ్ దేశంగా ఈజిప్ట్​ నిలిచింది. ఇందుకు సంబంధించిన ‘క్యాంప్ డేవిడ్ ఒప్పందం’పై సంతకం చేసినందుకు ‘ఈజిప్షియన్ ఇస్లామిక్ జిహాద్’ సభ్యులు సాదత్‌‌‌‌ను లక్ష్యంగా చేసుకున్నారు.

థామస్ సంకారా (బుర్కినా ఫాసో)

బుర్కినా ఫాసో విప్లవ నాయకుడు థామస్ సంకారా 1987 అక్టోబర్ 15న రాజధాని ఔగాడౌగౌలో జరిగిన సైనిక తిరుగుబాటులో మరణించారు. ఆయన సన్నిహితుడు  బ్లేజ్ కాంపోరే నేతృత్వంలోని హిట్ స్క్వాడ్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌‌‌‌లో జరుగుతున్న ప్రభుత్వ సమావేశంపై దాడి చేసి సంకారాతో పాటు మరో 12 మంది అధికారులను కాల్చి చంపారు.

పాట్రిస్ లుముంబా (డీఆర్ కాంగో)

రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు ప్రజాస్వామికంగా ఎన్నికైన మొట్టమొదటి ప్రధాని పాట్రిస్ లుముంబాను 1961 జనవరి 17న కటాంగా ప్రావిన్స్‌‌‌‌లో ఉరితీశారు. జోసెఫ్-డిసిరే మోబుటు నేతృత్వంలోని సైనిక తిరుగుబాటు ద్వారా పదవి కోల్పోయిన లుముంబా తన రాజకీయ స్థావరానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డారు. అత్యంత ఖనిజ సంపద కలిగిన కాంగో.. కోల్డ్​వార్​ సమయంలో సోవియట్ యూనియన్‌‌‌‌తో చేతులు కలపకుండా నిరోధించడానికి అమెరికాకు చెందిన సీఐఏ, బెల్జియం నిఘా సంస్థలు ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలిసింది.