- ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తం
- తలసేమియా, సికిల్ సెల్ పేషెంట్లదరికీ పెన్షన్ ఇస్తం
- ఏషియన్ తలసేమియా
- కాన్ క్లేవ్ లో మంత్రి దామోదర
- మేనరికపు పెళ్లిళ్లతోనే
- జెనెటిక్ ముప్పు.. నివారణే మార్గమని సూచన
హైదరాబాద్, వెలుగు: తలసేమియా బాధితుల కోసం మరో మూడు డే కేర్ సెంటర్లను అందుబాటులోకి తెస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో డే కేర్ సెంటర్లను నడిపిస్తున్నామని, త్వరలోనే ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లోనూ అదనపు సెంటర్లను తెరుస్తామని తెలిపారు.
మహబూబ్ నగర్, మేడ్చల్ జిల్లాల్లో ప్రతి గర్భిణీకి తలసేమియా టెస్టులు విజయవంతంగా చేస్తున్నామన్నారు. తలసేమియా అండ్ సికిల్‌సెల్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కమల హాస్పిటల్‌లో జరిగిన ‘ఏషియన్ తలసేమియా కాన్‌క్లేవ్’ లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశ, విదేశాల నుంచి వచ్చిన డాక్టర్లు, నిపుణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హీమోఫీలియా వంటివి వ్యాధులు మాత్రమే కావని.. అవి బాధిత కుటుంబాలను, సమాజాన్ని జీవితకాలం వెంటాడే తీవ్రమైన సవాళ్లని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి తలసేమియారహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం 2035 నాటికి డెడ్ లైన్ పెట్టుకొని పనిచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. తలసేమియా, సికిల్ సెల్ పేషెంట్లు అందరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
హెల్త్ విజన్ 2047లో భాగంగా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ధ్యేయమని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో సికిల్ సెల్ వ్యాధిని గుర్తించేందుకు ఇప్పటివరకు 11 లక్షల మందికి పైగా స్క్రీనింగ్ చేశామని, వ్యాధి ఉన్నవారికి ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని చెప్పారు. నిమ్స్ హాస్పిటల్ లో బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ వంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు.
పెళ్లికి ముందు జంటలు కౌన్సెలింగ్ తీసుకోవాలి
మేనరికం వివాహాలు చేసుకోవడం వల్లే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు సంక్రమిస్తున్నాయని మంత్రి దామోదర పేర్కొన్నారు. వీటిని అడ్డుకోవాలంటే పెళ్లికి ముందే జంటలు స్క్రీనింగ్, కౌన్సెలింగ్ తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో సామాజిక అవగాహన పెంచడమే సరైన మార్గమని, నివారణే దీనికి అత్యుత్తమ చికిత్స అని పేర్కొన్నారు. మిషన్ తలసేమియా ఫ్రీ తెలంగాణ కోసం స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు కలిసిరావాలని మంత్రి పిలుపునిచ్చారు.
